Thursday, April 25, 2024

3 Capital Bill: అమరావతి అంటే వ్యతిరేకత లేదు.. ప్రభుత్వ సదుద్దేశాన్ని వివరిస్తా: సీఎం

అమరావతి ప్రాంతంపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సోమవారం మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. అమరావతి ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని తెలిపారు. అయితే ఇక్కడ కనీస వసతులు లేవన్న సీఎం.. కనీస వసతులకు ఎకరాకు రూ.2 కోట్లు అవుతాయిని తెలిపారు. రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగిందని సీఎం జగన్ గుర్తుచేశారు. వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశామని తెలిపారు.  అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు.. వీరందరి ఆశలూ, ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నారు. అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారని చెప్పారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు.

మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా గానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరుస్తామని తెలిపారు. బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, ఏవైనా మార్పులు చేసేందుకు, గతంలో ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ప్రకటించారు. గతంలో చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement