Friday, April 26, 2024

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని సీఎం జగన్‌అన్నారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై  సీఎం మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం గత పాలకులు హోదాను తాకట్టు పెట్టారని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలోని ఇద్దరు పెద్దలు కేంద్రమంత్రి పదవులు కూడా చేపట్టారని.. గత ప్రభుత్వం మాటలతో భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలుసునని సీఎం పేర్కొన్నారు. 

ఓటుకు కోట్ల కోసం గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ప్యాకేజీ కోసం రాజీపడిందని, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేకహోదా ఇవ్వాలని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేకహోదా ద్వారా ప్రైవేటు రంగంలో వచ్చే ఉద్యోగాలనూ తాకట్టు పెట్టారన్నారు. దేవుడి దయతో ఎప్పుడో ఓ సారి మంచి జరుగుతుందని అనుకుంటున్నానని చెప్పారు. కొవిడ్ పరిస్ధితుల్లో రాష్ట్ర ఆదాయం తగ్గిందన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపట్టామని సీఎం జగన్ వెల్లడించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అయితే వెనుకంజ వేయొచ్చేమో కానీ, పూర్తి మెజారిటీతో ఉన్న కేంద్రం.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవడం లేదని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement