Tuesday, December 3, 2024

AP | స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047కి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలో చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. నీతి ఆయోగ్‌తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఈ విజన్ డాక్యుమెంట్‌పై 17 లక్షల మంది మేధావులు, వివిధ రంగాల్లో నిపుణులు, సామాన్యులు తమ సూచనలు, సలహాలు అందించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డాక్యుమెంటు నమూనాను రూపొందించి ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇక డిసెంబర్ 12న విద్యార్థులు, సామాన్యుల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు.

అలాగే ఈ విజన్‌కు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు 10 సూత్రాలను ప్రకటించిన విషయం విధితమే. పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం- మానవవనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు -బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్… అనే ప్రధాన సూత్రాలు ఈ డాక్యుమెంట్ లో ఉంటాయని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.

ఆశించిన ఈ లక్ష్యాలను సాధించే దిశలో విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement