Friday, November 29, 2024

AP: శ్రీశైలం జలాశయం గేట్ల మూసివేత..

డ్యాంకు తగ్గిన నీటి ప్రవాహం
విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే వినియోగం
జూరాల నుంచి పూర్తిగా తగ్గిన ప్రవాహం
సుంకేసుల నుంచి మాత్రమే నీటి ప్రవాహం
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, కర్నూలు బ్యూరో : శ్రీశైల జలాశయానికి చెందిన గేట్లను సోమవారం డ్యామ్ అధికారులు మూసివేశారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో అక్కడి అధికారులు ఆ ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సుంకేసుల నుంచి మాత్రమే నీరు వస్తుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా తగ్గింది. ఈ క్రమంలో జలాశయంకు చెందిన అన్ని గేట్లను డ్యాం ఇంజనీర్లు మూసివేశారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఎగో సుంకేసుల బ్యారేజీ నుంచి 77,598 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతుంది. ఇక జలాశయం 885 అడుగుల గాను 881.20 అడుగులుగా ఉంది. 215 టీఎంసీల నీటి నిల్వలకు గాను 194.3096 టీఎంసీలను నీటి నిల్వలు ప్రస్తుతం జలాశయంలో ఉన్నాయి. అయితే వరద నీటితో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల సహాయంతో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

ఇందులో ఏపీ పరిధిలోని కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 30,671, తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 37,540 క్యూసెక్కుల నీరు దిగుసాగర్ కు విడుదలవుతుంది. మొత్తంగా శ్రీశైలం ఎగువ భాగంలో వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో శ్రీశైలం డ్యామ్ గేట్లను మూసి వేసినట్లు శ్రీశైలం జలాశయం ఎస్ఈ శ్రీరామమూర్తి వెల్లడించారు. వాస్తవంగా గత నెల జూలై 27వ తేదీ నుంచి శ్రీశైల జలాశయం గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న సంగతి విధితమే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement