Sunday, May 16, 2021

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ – దుంగలు స్వాధీనం

ఏర్పేడు సమీపంలోని కృష్ణా పురం సమీపంలోని అడవుల నుంచి మోసుకుని వస్తున్న 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడం తో పాటు, తమిళ నాడుకు చెందిన ఒక స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. అనంతపురం రేంజి డిఐజి క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీ లు గిరిధర్, మురళీధర్ నేతృత్వంలో ఆర్ ఐ భాస్కర్ టీమ్ లోని లింగాధర్ బృందం గురువారం రాత్రి నుంచి ఏర్పేడు సమీపంలోని కృష్ణాపురం అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 15 మంది స్మగ్లర్లు కృష్ణాపురం బీట్ జల్లురాళ్ల గుట్ట వద్ద ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలు పడవేసి, చీకట్లో పారిపోయారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక స్మగ్లర్ ను పట్టుకో గలిగి నట్లు అక్కడకు చేరుకున్న డీఎస్పీ మురళీధర్ తెలిపారు. స్మగ్లర్ ను విచారిస్తున్నామని, ఇతనిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు సమీపంలో ని జవ్వాది మలై కు చెందిన జయశంకర్ (43)గా గుర్తించినట్లు తెలిపారు. ఇతనితో పాటు వచ్చిన వారి కోసం గాలుస్తున్నట్లు తెలుపారు. ఈ స్మగ్లర్ నుంచి మరింత సమాచారం రాబడుతున్నట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ బృందాలు శేషాచలం లోని అన్ని కొండ ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని చెప్పారు. సంఘటన స్థలానికి డీఎస్పీ మురళీధర్ తో పాటు ఆర్ ఐ భాస్కర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News