Wednesday, December 7, 2022

రాయల చెరువు లీకేజీ నుంచి త‌ప్పిన ముప్పు.. స్వగ్రామాలకు ప్రజలు

చిత్తూరు, ప్ర‌భ‌న్యూస్: చంద్రగిరి నియోజకర్గంలో రాయల చెరువు కట్ట లీకేజీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో పూర్తి స్థాయిలో అరికట్టారు. ఈ ముప్పు తప్పిన నేపథ్యంలో తిరుచానూరు శ్రీపద్మావతి నిలయం అతిథి గృహంలో వారం రోజుల పాటు తలదాచుకున్న 25 గ్రామాల ప్రజల్ని వారి స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఆదివారం ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మీ, తనయుడు, తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై తిరుచానూరు శ్రీపద్మావతీ నిలయం పునరావాస కేంద్రంలో ఉన్న రామచంద్రాపురం, తిరుపతి రూరల్ లోని 25 గ్రామాల ప్రజలకు పట్టుచీర, ఆకు, వక్క, పసుపు, కుంకుమ, పండ్లతో కూడిన సారే దాదాపు వెయ్యి మంది మహిళలకు అందజేశారు. ప్రత్యేక వాహనాల్లో ప్రజలను తమ స్వగ్రామాలకు గౌరవంగా సాగనంపారు. నిర్వాసితులు సైతం సంతోషంగా తమ స్వగృహాలకు తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. టిటిడి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వారం రోజుల పాటు ఎలాంటిలోటు పాట్లు లేకుండా సకల సౌకర్యాలు కల్పించామన్నారు. నిర్వాసిత ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి చూశామని మోహిత్ రెడ్డి అన్నారు. అనంతరం లక్ష్మీ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు అందజేశారు. అంతకుముందు లక్ష్మీ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి నిర్వాసితులను ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే చెబిరెడ్డి కుటుంబ పెద్దగా తమ పట్ల ఆలోచించారని నిర్వాసితులన్నారు. నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు చక్కటి వసతి కల్పించారని పేర్కొన్నారు.

- Advertisement -
   

తమకు ఏలోటు రానీకుండా సపర్యలు చేశారన్నారు. ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా ధైర్యం చేసి కట్ట నుంచి నీరు లీకేజీ అవుతున్నా.. తన ప్రాణాలను సైతం లెక్క చేయక రాయల చెరువుపైనే ఉంటూ తమను సురక్షిత ప్రాంతాలకు తరలించిన మహనీయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి అని కొనియాడారు. మా ఎమ్మెల్యే రుణం ఎన్నటికీ తీర్చుకోలేమని ప్రజలు తెలియజేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్ఫూర్తితో నిర్వాసితులకు సహాయ సహకారాలు అందించేందుకు స్వచ్ఛందంగా పలువురు ముందుకొచ్చారని తుడా సెక్రటరీ లక్ష్మీ పేర్కొన్నారు. ఇక్కడ సిబ్బంది కూడా కష్టపడి పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement