Thursday, April 25, 2024

గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా 29న దేశవ్యాప్త ఆందోళన.. సీపీఐ నేత‌ నారాయణ

తిరుపతి సిటీ : గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా ఈనెల 29న దేశ‌వ్యాప్త ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న‌ట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. శనివారం తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పార్లమెంటులో ప్రతిపక్షాల వ్యతిరేకించినప్పటికీ ఉమ్మడి పౌరసత్వ బిల్లును ప్రైవేటు బిల్లుగా బిజెపి సభ్యుడు రాజ్యసభలో ప్రవేశ పెట్టడం మోడీ నియంతృత్వానికి నిదర్శనమ‌న్నారు. ఉమ్మడి పౌరసత్వ బిల్లు అమలు జరిగితే దేశానికే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు. భారత దేశంలో మోడీ తీసుకుంటున్న నిర్ణయాలతో లౌకిక వాదం, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం తప్పదన్నారు. ఉమ్మడి పౌరసత్వ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఏమిటో తక్షణం వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ బిల్లుపై తన పార్టీ పార్లమెంటు సభ్యులకు ఏమి సూచన చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా కేసీఆర్ ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే బిజెపిని కేంద్రంలో సాగనంపాలంటే బిజెపి వ్యతిరేక కూటమిలో కేసీఆర్ భాగస్వామ్యం కావాలన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రకు అనూహ్య స్పందన లభించిందన్నారు. తుఫాను కారణంగా శనివారం నుండి కొనసాగాల్సిన పాదయాత్ర రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. గవర్నర్ల వ్యవస్థ కేంద్రానికి దళారీ వ్యవస్థగా మారిందన్నారు. రాష్ట్రపతి కంటే ముందు ప్రధాని, హోం మంత్రి లకు సమాచారం చేరవేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఇబ్బందులకు గురిచేస్తున్నార‌న్నారు. ఫిబ్రవరి 24 నుండి పాండిచ్చేరిలో సిపిఐ జాతీయ సమితి సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, నదియా, నగర కార్యదర్శి విశ్వనాథ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement