Tuesday, March 26, 2024

వివేకా హ‌త్య కేసులో త‌మ కుటుంబానికి సంబంధం లేద‌ని వెంక‌న్న సాక్షిగా లోకేష్ ప్ర‌మాణం..‌

తిరుపతి: ముందుగా ప్ర‌క‌టించిన విధంగా నేడు అలిపిరి వెంక‌న్న పాదాల సాక్షిగా వివేక‌నంద‌రెడ్డి హ‌త్య కేసులో త‌మ కుటుంబానికి ఏ విధ‌మైన సంబంధం లేద‌ని టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్ర‌మాణం చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, వివేకా హత్యపై వైసీపీ నేతలు పూటకో మాట చెప్పారన్నారు. నారాసుర రక్తచరిత్ర అంటూ దొంగవార్తలు రాశారని మండిపడ్డారు. … ‘‘నాకు, నా కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి పాత్ర లేదని ఆ వేంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేస్తామని ఏప్రిల్ 7న సూళ్లూరుపేటలో సవాల్ చేశాను. జగన్ పెద్ద దొంగ… ఏ2 విజయ్ సాయిరెడ్డి చిన్న దొంగ. వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీ నేతల్లో చాలా మంది ఇదే మాట అన్నారు. దాదాపు మూడు గంటల తర్వాత పోలీసుల విచారణలో ఆయనను గడ్డపారతో చంపారని తేలింది. పోస్టుమార్టం జరగకముందే ఎవిడెన్స్ లేకుండా ఆరోజే చెరిపేశారు. ఆ సమయంలో గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులందరూ సీన్‌లో ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత మాట మార్చారు. లోకేశ్‌కు, చంద్రబాబుకు హస్తం ఉందని ఆరోపించారు. తాతను, వివేకాను చంపింది మేమేనన్నారు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసి కూడా ఇదే చెప్పారు. మరి సీఎం అయ్యాక ఎందుకు… సీబీఐ విచారణ జరపడం లేదు. చిత్తశుద్ధి ఉంటే అలిపిరికి రావొచ్చు కదా. ఎందుకు రాలేదు? నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద పెద్ద వార్తలు రాశారు. మా కుటుంబానికి రక్తచరిత్ర లేదు. ‘కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు.. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి జగన్‌రెడ్డి బయటికి రాలేదన్నారు. చెల్లికి న్యాయం చేయలేనివాడు మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? అని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యలో జగన్‌రెడ్డి పాత్ర ఉంది.. అందుకే రాలేదన్నారు. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చి ప్రమాణం చేశామన్నారు. కత్తులతో బతికే చరిత్ర ఏ కుటుంబానిదో ప్రజలకు తెలుసన్నారు. జగన్‌రెడ్డి సొంత కుటుంబ సభ్యుల్ని చంపాడన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement