Friday, December 6, 2024

త్వరలో ఎర్ర స్మగ్లర్ల వేటలో ఐ శాట్ ఫోన్లు.. చ‌క్ర‌వ‌ర్తి

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి ) : ఎర్ర చందనం స్మగ్లింగ్ ని అరికట్టే చర్యల్లో భాగంగా ఐ శాట్ ఫోన్ల వినియోగం వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఎర్ర చందనం నిరోధక టాస్క్ ఫోర్స్ పోలీస్ సూపరింటెండెంట్ చక్రవర్తి వెల్లడించారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత ఏడాది కన్నా ఎక్కువగా ఈ  ఏడాది మధ్యకాలంలో తమ శాఖ సాధించిన ప్రగతిని వివరించారు. ఇప్పటి వరకు 180 కేసులు నమోదు చేసి 281 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ క్రమంలో 2,286 ఎర్ర చందనం దుంగలను, 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 45 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్నారని తెలిపారు.

తొలి నుంచి దొరకకుండా తిరుగుతున్న 73 మంది స్మగ్లర్లను కూడా ఈ ఏడాది అదుపులో తీసుకున్నామన్నారు. 35 మంది పై బైండ్ ఓవర్ కేసులు పెట్టమని తెలిపారు.  భవిష్యత్ ప్రణాళికలో భాగంగా అటవీ, పోలీసు, రెవిన్యూ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కూంబింగ్ విస్తృతం చేస్తామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడంలో భాగంగా ఐ శాట్ ఫోన్ల వినియోగం, కీలక ప్రాంతాల్లో సి సి టీవీ ల ఏర్పాటు, డాగ్ స్క్వాడ్ పునరుద్ధరణ వంటి చర్యలు తీసుకుంటామన్నారు. అంతరాష్ట్ర స్మగ్లింగ్ నిరోధంలో భాగంగా త్వరలో వివిధ రాష్ట్రాల సమన్వయ సమావేశం తిరుపతి నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని చక్రవర్తి తెలిపారు. ఎప్పటికప్పుడు స్మగ్లింగ్ కు సంబంధిత సమాచార సేకరణకు టోల్ ఫ్రీ నెంబర్లతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement