Friday, March 29, 2024

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. కలెక్టర్ వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి

తిరుపతి : మాండూస్ తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నీటి కుంటలు చెరువులు నిండి ముంపుకు ప్రాంతాలు, కాజ్ వేలు కోతలకు గురయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి సూచించారు. 26 మందితో ఎన్డిఆర్ ఎఫ్ టీమ్‌ను నాయుడుపేట వద్ద, 32 మందితో ఎస్ డి ఆర్ ఎఫ్ టీమ్ గూడూరు వద్ద అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు కొరకు ఏర్పాటు చేశామ‌న్నారు. మట్టి మిద్దెలు పూరి గుడిసెలు వంటివి వర్షాలకు కూలిపోయే అవకాశం ఉన్న వాటిలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వసతులు కల్పించాల‌న్నారు. మండల అధికారులు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తుఫాను ప్రభావంతో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, తెగిన రహదారులు కుంటలను వెంటనే పునరుద్ధరించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల‌న్నారు. జిల్లాలో 126 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామ‌ని, 9.45 గం. వరకు నాలుగు పునరావాస కేంద్రాలలో 264 మందికి వసతి కల్పించామ‌న్నారు. 24 x7 కంట్రోల్ రూమ్ లు అప్రమత్తంగా పనిచేయాలి అన్నారు. సముద్ర తీర ప్రాంత మండలాలు అప్రమత్తంగా ఉండాల‌న్నారు. ప్రమాద స్థాయిలో ఉన్న చెరువులు, వాగులు, ట్యాంకుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాటి మరమ్మతుకు చర్యలు చేపట్టాలి, ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచుకోవాల‌న్నారు. తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement