Friday, March 29, 2024

ఘనంగా అన్న‌మ‌య్య 518వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం

తిరుపతి – తొలి తెలుగు వాగ్గేయ‌కారుడు, శ్రీ‌వారి అప‌ర‌భ‌క్తుడు శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతి మహోత్సవాలు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది. ముందుగా ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు క‌లిసి దిన‌ము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు. ఆ త‌రువాత ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు ఆర్‌.సుశీల బృందం గాత్ర సంగీత స‌భ ప్రారంభమైంది. అనంత‌రం ఉదయం 11.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి పి.జయంతి సావిత్రి బృందం హరికథ వినిపించారు.

మహతిలో …
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు తిరుప‌తికి చెందిన డా. కె.శైలేశ్వ‌రి బృందం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు విజ‌య‌న‌గ‌రానికి చెందిన బి.ఏ.ప‌వ‌న్‌కుమార్ బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు జ‌ర‌గ‌నున్నాయి..ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య సింగ‌రాజు ద‌క్షిణా‌మూర్తి శ‌ర్మ, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, ఇతర అధికారులు, ఆధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement