Thursday, March 28, 2024

చీరల మాటున ‘ఎఫిడ్రిన్‌’ బుకింగ్‌.. బెజవాడ కొరియర్‌ డ్రగ్స్‌ కేసులో చెన్నై వ్యక్తి అరెస్టు..

అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడలో కొరియర్‌ సంస్ధ నుంచి విదేశాలకు డ్రగ్స్‌ సరఫరా అయిన కేసును ఎట్టకేలకు బెజవాడ పోలీసులు ఛేదించారు. తప్పుడు ఆధార్‌తో కొరియర్‌ లో బుక్‌ చేసిన కీలక వ్యక్తిని గుర్తించి చెన్నైలో అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి భారీగా స్మగుల్‌ గూడ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి కొరియర్‌ చేస్తే తెలిసిపోతుందని విజయవాడను ఎంపిక చేసుకున్నట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడు. పైగా చెన్నైకి చెందిన సదరు నిందితుడు గతంలో కూడా ఈ తరహా డ్రగ్స్‌ సరఫరాకు పాల్పడినట్లు వెల్లడైంది. చెన్నైలో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకువచ్చిన పోలీసులు ఉన్నతాధికారుల ముందు హాజరుపరిచారు. మరిన్ని వివరాలు సేకరించిన మీదట నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ వ్యవహారానికి సంబంధించి పలు అంశాలను డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు. విజయవాడ నుంచి కొరియర్‌ చేసిన కుప్పుస్వామి అరుణాచలం వెంకటేశన్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగింది..?

పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి.. ఇంజనీరింగ్‌ చదివి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 31న విజయవాడ భారతీనగర్‌లోని డీఎస్‌టీ కొరియర్‌ ద్వారా.. ఆస్ట్రేల్రియాకు ఓ పార్శిల్‌ను కొరియర్‌ చేశాడు. పార్శిల్‌ పంపడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరని కొరియర్‌ సంస్థకు చెందిన గుత్తుల తేజ సూచించాడు. స్పష్టత లేని ఓ ఆధార్‌కార్డు జిరాక్స్‌ను గోపీసాయి ఇచ్చాడు. అది పనికిరాదని, మరొకటి తీసుకురావాలంటూ తేజ చెప్పాడు. తన దగ్గర వేరే కార్డు లేదని, ఎప్పుడూ ఇక్కడి నుంచే కొరియర్‌ చేస్తానని నమ్మబలకడంతో.. తేజ తన ఆధార్‌ కార్డు నంబరుతో కొరియర్‌ను ఆస్ట్రేల్రియాకు బుక్‌ చేశాడు. కానీ.. పార్శిల్‌ మీద వివరాలు తప్పుగా ఉండడంతో అది కెనడా వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది. బెంగళూరు విమానాశ్రయంలో ఆ పార్శిల్‌ కస్టమ్స్‌ అధికారుల చేతిలో పడింది. అనుమానం వచ్చి తనిఖీ చేయగా..అందులో 4.49 కిలోల ఎఫిడ్రిన్‌ అనే డ్రగ్స్‌ను గుర్తించారు. పార్శిల్‌పై ఉన్న ఆధార్‌ కార్డు నంబరు ద్వారా గుత్తుల తేజను ఏప్రిల్‌ 27న బెంగళూరు రప్పించి విచారణ అనంతరం అతన్ని ఏప్రిల్‌ 30న అరెస్ట్‌ చేశారు. జరిగిన విషయంపై బెంగళూరు కస్టమ్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడ పోలీసులు అప్రమత్తమై రంగంలోకి దిగారు.

దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలు ఇవే..

బెజవాడ కేంద్రంగా డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లు తె లుసుకున్న పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. భారతీనగర్‌లోని కొరియర్‌ సంస్ధ నుంచి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కొరియర్‌ ద్వారా పార్శిల్‌ పంపింది గోపిసాయి కాదని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో సత్తెనపల్లి నుంచి మరో బృందం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా గోపిసాయిని పిలిపించి విచారణ జరిపారు. తన ఆధార్‌ కార్డును ఎవరో దురి ్వనియోగం చేసినట్లు గోపి సాయి ఫిిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేశారు. సీపీ కాంతి రానా నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై తదితర చోట్ల కు వెళ్ళాయి. గోపిసాయి చెన్నైలో చదువుకునే సమయంలో ఒక హోటల్‌లో ఇచ్చిన ఆధార్‌ కార్డును చేజిక్కించుకున్న దుండగులు దానిలోని ఫొటో, డేట్‌ ఆఫ్‌ బర్త్‌లో మార్పు చేసి నకిలీ ధృవీకరణ పత్రం ద్వారా ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.

- Advertisement -

దీంతో మరో బృందం విజయవాడలోని కొరియర్‌ సంస్ధ వద్ద సీసీ కెమేరా పుటేజీలు పరిశీలించి పార్శిల్‌ బుకింగ్‌ చేసిన వ్యక్తులను గుర్తించారు. మరోవైపు ఆధార్‌లో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా ట్రాకింగ్‌ పెట్టారు. తద్వారా నిందితుల కదలికలు తెలుసుకుని పక్కా నిర్ధారణకు వచ్చాక మరో బృందం చెన్నై ఎయిర్‌పోర్టులో దుబాయి నుంచి వస్తున్న ప్రధాన నిందితుడు అరుణాచలం వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరుణాచలం మరో ఇద్దరితో కలిసి జనవరి 31న విజయవాడలోని కొరియర్‌ సంస్ధ ద్వారా డ్రగ్స్‌ను చీరల మాటున పెట్టి ఆస్ట్రేలియాకు కొరియర్‌ చేసినట్లు వాస్తవాలు నిగ్గు తేల్చారు. దీంతో అరుణాచలంను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి బిల్లులు లేని రూ.25లక్షలు విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను దుబాయి, భారత్‌ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ఇకపై కొరియర్‌ సంస్ధల్లో తనిఖీలు షురూ..

కాగా కలకలం రేపిన కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరా వ్యవహారంలో విజయవాడ పోలీసులు సీరియస్‌గా స్పందించారు. కేసు ఛేదించి అసలు నిందితుడిని పట్టుకున్న నేపధ్యంలో ఈ తరహా కార్యకలాపాలపై మరింత నిఘా ఉంటుందని డీ సీపీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. అదేవిధంగా ఇక నుంచి కొరియర్‌ సంస్ధలపైనా ఆరా ఉంటుందని, తనిఖీలు చేస్తామని, సంస్ధల నిర్వహకులు కూడా పరిశీలించి తగు జాగ్రత్తలు పాటించాలని, ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement