Sunday, March 24, 2024

Followup: పోతిరెడ్డిపాడు వద్ద చిరుత.. ప్రాజెక్టు గేట్లపై అటు ఇటు సంచారం (వీడియో)

కర్నూలు, (ప్రభ న్యూస్‌ బ్యూరో): వేసవి తీవ్రత నేపథ్యంలో ఆహారం, నీటి కోసం వన్యమృగాలు జనావాసంలోకి వస్తున్నాయి. అలా వస్తున్న క్రూరమృగాలు.. జనాన్ని గాయపర్చడమే, లేదా జనం బారినపడి చావడమో జరుగుతోంది. తాజాగా నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రేగులేటర్‌ వద్ద చిరుతపులి హల్‌చల్‌ చేసింది. ప్రాజెక్టు గేట్లపై అటు ఇటు తిరుగుతూ స్థానికుల కంటపడింది.. దీంతో స్ధానికులు గమనించి సెల్‌ ఫోన్‌ లో వీడియోలు తీశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గేట్ల సిమెంట్‌ బెడ్ల నీడన చిరుతపులి సేద తీరింది. చిరుత సంచారం గురించి తెలియడంతో ప్రాజెక్టు పక్కనే ఉన్న, పోతులపాడు, చాబోలు, బన్నూరు గ్రామస్తులతో పాటు ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న నల్లమల అడవి ప్రాంతాలైనా కొక్కరంచ, ఎదురుపాడు, జెడ్‌ వారి పల్లె , సింగరాజు పల్లి, ఎర్ర మఠం, కపిలేశ్వరం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కొత్తపల్లి మండలం నల్లమల అటవీ ప్రాంతం నుంచి కృష్ణానది మీదుగా చిరుతపులి వచ్చి ఉండవచ్చని స్ధానికులు భావిస్తున్నారు.

చాబోలు గ్రామస్తుల సమాచారంతో చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. సమాచారం తెలుసుకున్న జూపాడుబంగ్లా ఎస్‌ ఐ వెంకటసుబ్బయ్య , అటవీశాఖ రేంజ్‌ అధికారి బాల సుబ్బయ్య సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాజెక్టుపై చిరుత సంచారం గమనించిన అటవీ శాఖ అధికారులు కొత్తపల్లి మండలం నల్లమల అడవుల నుంచి అక్కడికి చేరుకుని ఉండవచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిరుత ప్రాజెక్టులు గేట్ల పైన ఖాళీ స్థలంలో సేద తీరుతుందని, ఏ మాత్రం భయాందోళనకు గురిచేస్తే జనం మీదికి, సమీప గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. చిరుతను అటవీ ప్రాంతంలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నామని ఫారెస్ట్‌ రేంజర్‌ వెల్లడించారు.

వీడియో కోసం www.prabhanews.com క్లిక్​ చేయండి

Advertisement

తాజా వార్తలు

Advertisement