Friday, April 19, 2024

అక్రమ లే అవుట్లకు చెక్.. రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు..

విజయవాడ, ప్రభన్యూస్ : అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గ్రామ, పట్టణ, నగర ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే ప్లాట్లు వేసి రియల్డర్లు విక్రయాలు సాగిస్తున్నారు. అధికారులు ముడుపుల మత్తులో జోగుతూ అక్రమ లేఅవుట్లకు పచ్చజెండా ఊపుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టా ఆదాయ వనరులు సమీకరించుకోవాలనే లక్ష్యంతో అక్రమ లే అవుట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది.. జిల్లాలో అనాధికార లేఅవుట్లు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో ఇబ్బడిమబ్బడిగా వెలిసాయి. వాటికి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉండగా ఆ విషయాన్ని విస్మరిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం లేఅవుట్లు లేకుండా ఎటువంటి స్థలాలకు రిజిస్ట్రేషన్‌ చేయద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్రమ లేఅవుట్లు వేసే స్థిరాస్థి వ్యాపారులకు చెక్ పెట్టినట్లయింది. మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరిగే అవకాశాలున్నాయి.

లేఅవుట్లు అనుమతులు పొందాలంటే 30 అడుగుల రహదారితో పాటు పది శాతం ఖాళీ స్థలాన్ని స్థానిక సంస్థలకు అప్పగించాలి. కానీ పది శాతం ఖాళీ స్థలం ఇవ్వకుండానే లే అవుట్‌లు వేస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లుతోంది. పార్కు, కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి ఖాళీ స్థలాలు విడచిపెట్టుకున్నా లే అవుట్‌లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. లేఅవుట్‌కు రిజిస్ట్రేషన్‌ విలువలో 14 శాతం సొమ్ము వసూలు చేస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు. బెటర్‌మెంట్‌ ఛార్జీలు ఎప్పటిలాగే వసూలు చేస్తారు. నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా కొంత మంది రియల్డర్లు ఇష్టానుసారంగా వ్యవసాయ భూములను ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నారు. లే అవుట్‌ లేని స్థలాన్ని కొనుగోలు చేసినా గృహ నిర్మాణ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. లే అవుట్‌ ఉంటే ఇంటి నిర్మాణ ప్లాన్‌కు అప్రువల్‌ ఇస్తారు. ఫలితంగా అనధికారంగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు అనుమతి లేకుండా వేసిన లే అవుట్లలో స్థలాలకు సర్వే నెంబరు, దస్తావేజుల ఆధారంగా సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆ స్థలానికి సంబంధించి లేఅవుట్‌ అనుమతి(ఎల్‌పీ) ఉందా, లేదా అన్నది కూడా పట్టించుకోవడం లేదు.

దీంతో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. ఇప్పుడు అక్రమ లేఅవుట్లకు చెక్‌ పెట్టడంతో ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. లేఅవుట్ల ఉన్న స్థలాలకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు వల్ల పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు ఆదాయం పెరగనున్నది. అక్రమ లేఅవుట్లకు సంబంధించి స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయలని అన్ని సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. ఆదే సమయంలో పంచాయతీలు, నగర, పురపాలక సంఘాల పరిధిలోని అక్రమ లేఅవుట్ల వివరాలను, సర్వే నెంబర్లను గుర్తించి వాటిని ఆయా పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అందజేయాల్సి ఉంది. లేఅవుట్‌ స్థలాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే తప్పనిసరిగా లే అవుట్‌ అప్రూవల్‌ తప్పనిసరిగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో చూపించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రధాన రహదారుల వెంట, నగర పరిసరాలలో పంట పొలాలు కొనుగోలు చేసి ప్లాట్లు వేసి విక్రయాలు సాగించే స్థిరాస్థి వ్యాపారుల మోసాలకు రిజిస్ట్రేషన్ల నిలిపివేత చెక్‌పెట్టినట్లయింది. ఆదే సమయంలో స్థానిక సంస్థల ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement