Wednesday, April 17, 2024

Cheating: ఉద్యోగులు, డాక్టర్లు, వ్యాపారులకు టెండర్.. ఫ్లాట్ల పేరుతో కోట్లలో మోసం..

(బి. గిరి – తిరుపతి సిటీ, ప్రభన్యూస్)

పుణ్యక్షేత్రం.. విద్య,  వ్యాపార కేంద్రంగా తిరుపతి వర్థిల్లుతోంది.  ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి జీవనం సాగించేందుకు, స్థిరపడేందుకు చాలామంది వస్తూ ఉంటారు. దానికితోడు నగరం స్మార్ట్ సిటీగా డెవలప్ కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దాన్ని సాకుగా చూపి బిజినెస్ పెంచుకుంటున్నారు. అయితే తిరుపతి సిటీలో ఇటీవల అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుతోంది. వీధి వీధికి విస్తారంగా నిర్మాణాలు సాగుతున్నాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రోకర్లను పెట్టుకుని, బ్రోచర్లు.. వివిధ డిజైన్లతో ప్రచారం సాగిస్తూ అక్రమాలకు తెరతీస్తున్నారు. ఉద్యోగులు, డాక్టర్లు, వ్యాపారులకు ఫ్లాట్ల పేరుతో కోట్లలో మోసం చేసిన ఘటన వెలుగుచూసింది.

అపార్ట్ మెంట్ లో ఫ్లాట్లు అమ్మకానికి పెట్టిన ఓ బిల్డర్ బడా మోసానికి పాల్పడ్డాడు. కొనుగోలు దారుల నుంచి ఆరు కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అంతేకాకుండా ఆ ఫ్లాట్లను మార్ట్ గేజ్ చేసి మరో 8 కోట్ల రూపాయలను బ్యాంకు ద్వారా తీసుకున్నాడు. అయితే ఇదంతా ఫేక్ సర్టిఫికెట్లతో చేయడంతో ఇప్పుడు కొనుగోలుదారులు ఆందోళనచెందుతున్నారు. పైగా ఆ బిల్డింగ్ ను బ్యాంకు స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టడంతో ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు.

ఉద్యోగులు, వ్యాపారులు, డాక్టర్లకు అపార్ట్ మెంట్ లో ఫ్లాట్లు కొనుగోలు చేయాలని కోరుతూ వారి నుంచి కొంత మొత్తం వసూలు చేస్తున్నారు. సొంత ఇల్లు నిర్మాణానికి పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించుకోలేని వారికి విడతల వారీగా పేమెంట్ చేసి అపార్ట్మెంట్ తీసుకునేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతో కొంత పెట్టుబడి పెట్టి మిగిలింది బ్యాంక్ తనఖా ద్వారా లోన్ల రూపంలో డబ్బులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి నగరంలో అన్నారావు సర్కిల్ వద్ద ఓ బిల్డర్ కొమ్ము చెంచయ్య యాదవ్.. కొర్లగుంట మారుతి నగర్. డి .బి .ఆర్ హాస్పిటల్ సమీపంలో ఒక అపార్ట్ మెంట్ ను నిర్మాణం చేపట్టారు. ఇందులో 24 ప్లాట్లను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం సిటీ యూనియన్ బ్యాంక్ నుండి 8 కోట్ల రూపాయలు మార్ట్ గేజ్ లోన్ తీసుకున్నారు. 

అయితే ఒక్కొక్క ప్లాట్ ను రూ.50 లక్షల నుంచి 60 లక్షల దాకా అమ్మకాలు సాగించేందుకు ప్లాన్ చేశారు. దీనికోసం 13 మంది దగ్గర ఫ్లాట్ లను అమ్మేందుకు ఒక్కొక్కరి దగ్గర దాదాపు 50లక్షలకు పైగానే వసూలు చేసినట్టు బాధితులు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడుకు ఫిర్యాదు చేశారు. డాక్టర్లు, వ్యాపారస్తులు, ఉద్యోగులు ఇలా 13 మంది తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

మార్టిగేజ్ చూపకుండా కోట్లలో వసూలు..

ఈసీ నందు మార్ట్ గేజ్ చూసుకోకుండానే 6 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. దానికి తోడు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ కు చేయించినట్టు తెలుస్తోంది.  సంబంధించి ఆధారాలను జిల్లా అర్బన్ పోలీస్, జిల్లా ఎస్పీకి ఇందుకు సంబంధించి పత్రాలను బాధితులు అందజేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు.

సిటీ యూనియన్ బ్యాంకు నుంచి 8 కోట్లు..

బ్యాంకులో మార్టిగేజ్ కింద  తీసుకున్న 8 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ఆ అపార్ట్మెంట్ వేలం వేసేందుకు బ్యాంకు రెడీ అయ్యింది.. దీంతో బాధితులు తాము తీవ్రంగా నష్టపోయామని, అప్పు చేసి అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్టు తెలిపారు. తిరుపతి సిటీలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement