Thursday, April 18, 2024

ధాన్యం సేకరణ ధరలో మార్పు.. ఎంటీయు 1061 రకం కామన్‌ వెరైటీగా మార్పు

కృష్ణా, ప్రభన్యూస్‌ బ్యూరో : ధాన్యం సేకరణకు సంబంధించి గ్రేడింగ్‌లో వరి వంగడాలను మార్పు చేస్తూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు రైతులపాలిట శాపంగా మారాయి. గత 19 సంవత్సరాలుగా ఏ గ్రేడ్‌గా ఉన్న ఎంటీయు 1061 రకాన్ని కామన్‌ వెరైటీగా మార్పు చేస్తూ ఈనెల 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చిన ధాన్యం సేకరణ ఆప్షన్‌లో సార్టెక్స్‌, నాన్‌ సార్టెక్స్‌, కామన్‌ మూడు రకాలుగా గ్రేడింగ్‌ చేశారు. ఎంటీయు 1061 ధాన్యాన్ని కామన్‌ ఆప్షన్‌లో నమోదు చేయాలని ఆర్బికెలకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

ఏ గ్రేడ్‌ వెరైటీలకు క్వింటాకు రూ.2,060, కామన్‌ వెరైటీలకు రూ.2,040 కనీస మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్‌ మార్పు చేయడం వలనక్వింటాకు 20 రూపాయలు నష్టపోవలసి వస్తుందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. వాతావరణం అనుకూలించడంతో 1061 వరి వంగడం దిగుబడులు వస్తున్నాయి. ఎకరాకు 28 క్వింటాళ్లకు పైగా దిగుబడులు వస్తున్నాయి. అంటే ఎకరాకు రూ.560 వరకు రైతులు నష్టపోతారు. కృష్ణాజిల్లాలో 3.96 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే, అందులో 2.50 లక్షల ఎకరాల్లో ఎంటియు 1061 వరి వంగడాన్ని సాగు చేశారు. దీనివల్ల కృష్ణాజిల్లాలో ఈ రకం సాగు చేసిన రైతులకు రూ.14 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో ఎంటియు 1061 రకం వరి వంగడాన్ని అత్యధికంగా రైతులు సాగు చేశారు. ఇతర వంగడాలతో పోలిస్తే 1061 వంగడం సాగు ఖర్చు తక్కువగా ఉంటు-ంది. దీంతో 2003 సంవత్సరం నుంచి రైతులు అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో ధాన్యం సేకరణ ప్రారంభమైన పది రోజుల తర్వాత గ్రేడ్‌ ఏ లో ఉన్న ఈ ధాన్యాన్ని, కామన్‌ వెరైటీగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం చేయడంతో రైతుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రేడుగా ఉన్న ధాన్యాన్ని కామన్‌ వెరైటీగా మార్పు చేసి, మిల్లర్లకు దోచి పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రైతులు ఆ షాక్‌ నుంచి కోలుకోక ముందే తిరిగి మరల ఈ విధంగా ప్రకటించటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఖర్చులు కూడా రాని పరిస్థితులలో గ్రేడింగ్‌ మార్పు చేయడం సరైన పద్ధతి కాదని, దీనిపై పునరాలోచన చేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement