Wednesday, April 17, 2024

Pattikonda: చంద్రబాబు రైతు వ్యతిరేకి… జగన్

చంద్రబాబు రైతు వ్యతిరేకి అని, చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత లేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండలో వ‌రుస‌గా ఐదో ఏడాది తొలి విడత వైయ‌స్ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడుస్తాడన్నారు. రైతుకు చంద్రబాబు శత్రువు అన్నారు. రాజమండ్రిలో మహానాడు పేరుతో డ్రామా చేశారన్నారు. ఆ మహానాడు డ్రామాకు ముందు ఒక ప్రకటన చేశారన్నారు. అది చూస్తే అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరకు వచ్చిన మారీచుడు గుర్తొచ్చాడన్నారు. సీతమ్మ దగ్గరకు భిక్షగాడి రూపంలో వచ్చిన రావణుడు గుర్తొచ్చాడన్నారు. చంద్రబాబు సత్యాన్ని పలకరు.. ధర్మానికి కట్టుబడరన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంపేసి.. మళ్లీ ఆయన్నే కీర్తించారన్నారు.

చంద్రబాబుకు ఒరిజినాలిటీ లేదని, పర్సనాలిటీ లేదని, క్యారెక్టర్ లేదని, క్రెడబులిటీ అంతకన్నా లేదని సీఎం జగన్ అన్నారు. పోటీ చేసేందుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేరన్నారు. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతారని, ఏ గడ్డైనా తింటారన్నారు. చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు అని జగన్ అన్నారు. మరో ఛాన్స్ ఇవ్వండి ఏదో చేసేస్తా అంటున్నాడని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకునే ధైర్యం లేదని జగన్ అన్నారు. సీఎంగా మొదటి సంతకానికి ఒక క్రెడబులిటీ ఉంటుందన్నారు. కానీ చంద్రబాబు మొదటి సంతకాన్నే మోసంగా మార్చేశారన్నారు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని సీఎం జగన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement