Sunday, March 24, 2024

Big Breaking| ఏపీ కేబినెట్‌లో మ‌రో ముగ్గురి చాన్స్‌.. పార్టీపై ప‌ట్టు పెంచేందుకు జ‌గ‌న్ వ్యూహాలు!

ఆంధ్రప్రదేశ్​ కేబినెట్​లో కీలక పరిణామాలు జరగనున్నాయి. మంత్రివర్గంలోకి మరో ముగ్గురిని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్​ ఆదేశాలతో సీఎంవో ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇంతకుముందు జరిగిన మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కని వారికి ఈసారి చాన్స్​ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీఎం జగన్​ కుటుంబ సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రిగా అవకాశం ఇస్తున్నట్టు ప్రచారం జరగుతోంది. మరోసారి కొడాలి నానికి కూడా మంత్రివర్గంలో చాన్స్​ దక్కనున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో వైఎస్సార్​సీపీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)కి రోజు రోజుకూ త‌గ్గుతున్న ఆద‌ర‌ణ‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి వెంక‌ట‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితోపాటు.. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి పార్టీకి దూరం అయ్యారు. వీరితో పాటు మ‌రికొంత‌మంది బ‌డా లీడ‌ర్లు కూడా పార్టీని వీడేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ స‌మాచారం తెలుసుకున్న జ‌గ‌న్‌.. కోవూరు ఎమ్మెల్యే, సీనియ‌ర్ లీడ‌ర్ అయిన న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డికి మంత్రిగా చాన్స్ ఇవ్వ‌డానికి ముందుకొచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆ జిల్లాలో పార్టీని ముందుండి న‌డిపించే లీడ‌ర్ అవ‌స‌రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్ప‌టికే మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి అసంతృప్తుల‌ను క‌లుపుకునేలా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ముందుకు పోతున్నా.. పార్టీలోని కీల‌క నేత‌లు అల‌క‌బూన‌డం, అధినేత తీరు న‌చ్చ‌క పార్టీ వీడేందుకు రెడీ అయిన‌ట్టు స‌మాచారం అందుతోంది. అయితే ఈ నిర్ణ‌యంతో అసంతృప్త నేత‌ల‌ను ప్ర‌స‌న్న ద‌గ్గ‌ర చేసుకుని వారిని అనున‌యించి పార్టీలో కొన‌సాగించే వీలు ఉంటుంద‌న్న ఆలోచ‌న పార్టీ పెద్ద‌ల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

దీంతోపాటు.. ఈ మ‌ధ్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ చాతుర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అనుభవాన్ని అంతా రంగ‌రించి చ‌క్ర‌బంధ‌నం చేస్తున్నారు. ఈ మ‌ధ్య జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ద‌క్కాల్సిన ఎమ్మెల్సీ స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. దీంతో వైసీపీ కాస్త డీలా ప‌డిన‌ట్టు అయ్యింది. అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు 40 మంది టీడీపీకి ట‌చ్‌లో ఉన్నార‌ని, తాము ఓకే అంటే చేర‌డానికి రెడీగా ఉన్నార‌నే ప్ర‌చారం కూడా పెద్ద ఎత్తున జ‌రిగింది. ఈ విష‌యాల‌న్ని గ‌మ‌నించిన జ‌గ‌న్ పార్టీని కాపాడుకునేందుకు తాను కూడా గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో సీఎం జ‌గ‌న్ ప‌లు కీక‌ల మార్పులకు శ్రీకారం చుట్టినట్టు స‌మాచారం. అంద‌కనే జ‌గ‌న్ వ‌రుస‌గా గవర్నర్ తో భేటీ అవ‌డం, ఆ త‌ర్వాత ఢిల్లీ పర్యటన చేయ‌డం వంటివి జ‌రిగాయ‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. దీంతోపాటే ముందస్తు ఎన్నికలకు వెళ్తారా అనే ప్ర‌చారం కూడా మ‌రోవైపు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు లభిస్తే తెలంగాణ ఎన్నికలతో పాటు ఏపీలో కూడా ఎన్నికలకు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement