Thursday, April 25, 2024

అప్పులు హద్దులు దాటొద్దు..నిర్దేశించిన కేంద్రం

రాష్ట్రంలో ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయడానికి ఇకముందు వీలు లేదని కేంద్రం తేల్చింది. ఎడాపెడా రుణాలు తీసుకుని ఖర్చు చేయడానికీ కుదరదు. పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నికర రుణ పరిమితి ఎంతో కేంద్రం నిర్దేశిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ రెండు ఫార్మాట్లు పంపి అందులో గణాంకాలు నింపి తక్షణమే కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగానికి తెలియజేయాలని సూచించింది. ఇందులోనే అన్ని రకాల అప్పులు ఉంటాయి. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి స్థూల జాతీయోత్పత్తి ఎంత ఉండొచ్చని అంచనా వేశారో అందులో కేవలం 4 శాతం మేర మాత్రమే నికర రుణంగా ఉండాలి. అంటే… ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తం రుణంలో తిరిగి చెల్లించిన అప్పును మినహాయిస్తే నికర రుణ పరిమితి ఎంతన్నది తేటతెల్లమవుతుంది.


2017-18 ఆర్థిక సంవత్సరం వాస్తవ లెక్కల నుంచి 2021-22 అంచనాల వరకు ఆ ఫార్మాట్‌లో వివరాలు నింపాలి. అందులో ప్రతీ ఏడాది వారీగా… అన్ని విభాగాల్లో ఆ ఏడాది చేసిన అప్పు, తీర్చిన రుణం, నికర రుణం వివరాలు తెలియజేయాలని కోరింది. అన్ని రకాల అప్పుల వివరాలు నమోదు చేయాల్సిందే. అలాగే విద్యుత్తు డిస్కంల నష్టాల వివరాలు, అందులో రాష్ట్రం వాటా పేర్కొనాల్సి ఉంది. దీంతో పాటు పెట్టుబడి వ్యయంగా ఎంత ఖర్చు చేశారో తేల్చి చెప్పాలి.

మరో ఫార్మాట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రుణ గ్యారంటీలు ఎంత మేర ఇచ్చిందో వివరాలు కోరింది. 2020-21లో డిసెంబరు వరకు ఏ మేర గ్యారంటీలు ఇచ్చారు, ఆ తర్వాత మూడు నెలల్లో ఎన్ని ఇచ్చారు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎంత మేర రుణ గ్యారంటీ ఇవ్వబోతుందో అంచనాల వివరాలు కూడా తెలియజేయాలని కేంద్ర ఆర్థికశాఖ కోరింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర పబ్లిక్‌ రంగ సంస్థలు ఏ మేరకు నిధులు రాబట్టుకున్నాయన్న వివరాలూ పంపాలని పేర్కొంది. ఈ వివరాలన్నీ ఏప్రిల్‌ మొదటి వారానికల్లా పంపాలని గడువు విధించింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల బహిరంగ మార్కెట్‌ రుణ క్యాలెండర్‌ ఖరారు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మాట్‌ ప్రకారం వివరాలు పంపితేనే సాధ్యమవుతుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement