Sunday, March 26, 2023

ఏపీకి కేంద్రం 1000కోట్ల ఆర్థిక సాయం.. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు అనుమతి

ఏపీలో వెయ్యికోట్ల‌తో బ‌ల్క్ డ్ర‌గ్ పార్కు ఏర్పాటుకు కేంద్రం ప‌ర్మిష‌న్స్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు ఆమోదాన్ని తెలియజేస్తూ ఏపీ సర్కారుకు లేఖ రాసింది. ఈ లేఖ అందిన వారం రోజుల్లోగా త‌మ అంగీకారాన్ని తెలియజేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రసాయనాలు, ఎరువులు ఔషధ మంత్రిత్వశాఖ సూచించింది. ఈ ప్రాజెక్టుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కేంద్రం రూ.1000 కోట్లు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మకు ఆ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ ఎన్ .యువరాజ్ లేఖ రాశారు. అలాగే 90 రోజుల్లోగా ప్రాజెక్టు డీపీఆర్‌ని కూడా సమర్పించాల్సిందిగా కేంద్రం సూచించింది.

- Advertisement -
   

కేంద్రం సూచించిన మార్గదర్శకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను అందించాల్సిందిగా కేంద్ర మంత్రిత్వశాఖ తన లేఖలో పేర్కొంది. మరోవైపు, దేశవ్యాప్తంగా బల్క్ డ్రగ్ పార్కుల కోసం 13 రాష్ట్రాలు పోటీ పడితే అందులో 3 రాష్ట్రాలు మాత్రమే బల్క్ డ్రగ్ పార్కు పారిశ్రామిక వాడలను దక్కించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్కు కోసం పోటీ పడ్డాయి. మరోవైపు ఏపీలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం 2020 ఆగస్టులోనే రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో 2వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ ప్రైవేటు ఆపరేటర్లు మొత్తంగా రూ.6,940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. ఇందుకోసం ప్రత్యేక వాహక సంస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రైవేటు భాగస్వామి ద్వారా బల్క్ డ్రగ్ పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement