Thursday, April 25, 2024

ఏపీలో 4 కేంద్రీయ విద్యాలయాలు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయల ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా నాలుగు చోట్ల కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిగణనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనకాపల్లి, మాచర్ల, రొంపిచర్ల, నందిగామలో కేవీలు ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి సోమవారం బదులిచ్చారు. గుంటూరు జిల్లాలో మొత్తం 5 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని కేంద్రమంత్రి అన్నారు. సోమవారం లోక్‌సభలో దేశంలో కేంద్రీయ విద్యాలయాల కార్యాచరణ, కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 562 జిల్లాల్లో 1244 కేంద్రీయ విద్యాలయాలు పని చేస్తున్నాయని కేంద్రమంత్రి వివరించారు.

నీతి అయోగ్‌ దేశంలో 112 జిల్లాలను కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గుర్తించిందని, వీటిలో 16 జిల్లాల్లో ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా లేదని వివరించారు. మిగతా 90 జిల్లాల్లో 160 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నట్లు అన్నపూర్ణాదేవి వివరణ ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయాలు రాష్ట్రం, జిల్లాలవారీగా ఏర్పాటు చేయరని తెలిపారు. కొత్త కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించే ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన శాఖల ద్వారా జరుగుతాయన్నారు. కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు అనేది నిరంతర ప్రక్రియ అని, కేంద్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే వారి పిల్లల, పేద విద్యార్థుల విద్యావసరాలను తీర్చడానికి ప్రాథమికంగా మరిన్ని కేంద్రీయ విద్యాలయాలను స్థాపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement