Saturday, April 20, 2024

మళ్లీ వెనక్కి వెళ్లిపోయిన ప్రత్యేక హోదా అంశం.. అజెండా నుంచి తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. ఏపీకు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 17న కీలక సమావేశం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశం అజెండాను నిన్న ప్రకటించారు. అయితే, ప్రధాన అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని తొలగిస్తూ.. మరో సర్య్కూలర్‌ జారీ చేసింది. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లోని అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు సమాచారం. 

విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన సబ్ కమిటీ ఎజెండాలో తొలుత హోదా అంశాన్నీ చేర్చారు. శనివారం ఉదయం ఎజెండాలోనూ ప్రత్యేక హోదా ఉంది. కానీ, సాయంత్రం హఠాత్తుగా కమిటీ ఎజెండాను సవరించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ… అందులో హోదాను తొలగించింది. గంటల్లో వ్యవధిలోనే ఎజెండా మారిపోయింది. ప్రత్యేక హోదాతో పాటు ఉత్తరాంధ్రలోని 3, రాయలసీమలోని 4 కలిపి మొత్తం 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గ్రాంటు అంశాన్ని తొలుత ఎజెండాలో ఉంచినా.. సవరణలో దాన్నీ తొలగించారు. మొదట 9 అంశాలను ఎజెండాలో పెట్టిన ఆ హోం శాఖ.. సవరణలో అయిదింటినే ఉంచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌, తెలంగాణ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఏపీ నుంచి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సభ్యులుగా ఏర్పాటైన ఈ కమిటీ ప్రతీనెలా సమావేశమవుతుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ నెల 17న నిర్వహించనున్న కమిటీ తొలి భేటీకి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు హాజరు కావాలని రెండు రాష్ట్రాల సీఎస్‌లకు సమాచారం పంపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement