Tuesday, March 26, 2024

అమరావతి ఉద్యమానికి 600 రోజులు..

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన ఉద్యమం నేటితో 600 రోజులకు చేరింది. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఆదివారంతో 600వ రోజుకు చేరుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ముక్తకంఠంతో నినదిస్తూ సాగుతున్న ఉద్యమం ఇది. రాజధాని తరలిపోకుండా ఉండాలని రైతులు చేయని ప్రయత్నం లేదు. లాఠీలు విరిగినా, జైళ్లకు వెళ్లినా.. కరోనా భయపెడుతున్నా.. దేన్నీ లెక్కచేయకుండా తమ వారు చేస్తున్న అమరావతి పోరాటం 600వ రోజుకు చేరింది.

ఈ సందర్భంగా అమరావతి నుంచి మంగళగిరి వరకు రైతులు ర్యాలీ చేసేందుకు సంకల్పించారు. రాజధాని నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే, ఇందుకు అనుమతి లేదని తుళ్లూరు పోలీసులు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు.

ఏపీలో అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు సాగుతున్న ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమం చారిత్రాత్మకం అని అన్నారు. జగన్ చేస్తున్న దాడి అమరావతిపై కాదని, యావత్ రాష్ట్ర సంపద సృష్టిపైనే అని పేర్కొన్నారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఉద్యమానని అణచాలని చూసినా.. రైతులు చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కన్నతల్లి లాంటి 32 వేల ఎకరాల భూమిని రైతులు, రైతు కూలీలు త్యాగం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. వారు ఇచ్చిన భూమిలోనే హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగులకు ఇళ్లు కట్టించామన్నారు.

- Advertisement -

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ముంపు ప్రాంతమని, కేవలం ఒకే సామాజిక వర్గమే ఉందంటూ వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా వైసీపీ తప్పుడు ప్రచారాలు ఆగలేదన్నారు. రాజధానిలో రోడ్లు వేసిన కంకరను దొంగతనంగా తవ్వుకుని, హైకోర్టు సమీపంలో ఇసుకను మాయం చేసే స్ధితికి వైసీపీ నేతలు వచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

2019 డిసెంబరు 17న సాయంత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ చేసిన మూడు రాజధానుల ప్రస్తావన.. అమరావతి రైతులకు శరాఘాతమైంది. ఆ మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో ఉద్ధృతంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించారు. డిసెంబరు 18న వెలగపూడిలో తొలి దీక్షా శిబిరం మొదలైంది. అప్పటి నుంచి రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు అమరావతే ఆశ, శ్వాసగా పోరాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి 70-80 ఏళ్ల వృద్ధుల వరకు… రాజధాని పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. రాజధాని గ్రామాల ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి అలుపెరగని పోరాటం చేస్తున్నారు.రాజధాని కోసం దాదాపు రెండేళ్లుగా రైతులు పోరాడుతూనే ఉన్నాయి. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రహదారిపై బైఠాయింపు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ర్యాలీలు, న్యాయపోరాటాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు… ఇలా తమ బాధ వివరించేందుకు కనిపించిన ఏ మార్గాన్నీ వదలలేదు. దేశ రాజధాని ఢిల్లీ వరకు తమ ఉద్యమ స్వరాన్ని చేర వేశారు.

కరోనా సమయంలోనూ ప్రభుత్వం విధించిన నిబంధలకు లోబడి ఇళ్లల్లోనే నిరసన కొనసాగించారు. ప్రైవేటు స్థలాల్లో భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి నిరసనల్లో పాల్గొంటున్నారు. రైతుల ఉద్యమం మొదలయ్యాక… రాజధాని గ్రామాల్లోకి ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసుల బలగాల్ని మోహరించింది. 144 సెక్షన్‌, పోలీసు చట్టంలోని 30 సెక్షన్లను ప్రయోగించి ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది. కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుని.. గోడు వెళ్లబోసుకునేందుకు బయల్దేరి వెళ్లిన మహిళల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై లాఠీఛార్జ్‌ చేశారు. రాజధాని రైతులు.. జాతీయ రహదారి దిగ్బంధానికి ప్రయత్నించినపుడు.. వారపై లాఠీ ఝుళిపించారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రైతులకూ లాఠీ దెబ్బలు తప్పలేదు. మందడంలో దీక్షాశిబిరం నుంచి నిరసనకారుల్ని వెళ్లగొట్టే ప్రయత్నంలో పోలీసుల దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డ విషయం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.

రాజధాని విషయమై ప్రధాని మోదీ సహా రాష్ట్రపతికి రైతులు మూకుమ్మడి లేఖలు రాశారు. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్న మహిళలపై పోలీసులు మరోసారి విరుచుకపడిన ఘటనలో చాలా మంది గాయపడ్డారు. సీఆర్​డీఏ చట్టం రద్దు, 3 రాజధానుల బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌.. గత ఏడాది జూలై 31న ఆమోదం తెలపడంతో రాజధాని రైతులు ఆందోళన ముమ్మరం చేశారు. రాజధాని అంశంపై ప్రభుత్వ నిర్ణయాల్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. రాజధాని ఉద్యమంలో ఇప్పటివరకు 3 వేల మందికి పైగా కేసులు నమోదయ్యాయి. ఉద్యమం మొదలయ్యాక ఇప్పటి వరకు సుమారు 170 మంది దాకా రైతులు, కూలీలు వేదనతో మరణించినట్లు అమరావతి జేఏసీ నేతలు తెలిపారు.

ఇది కూడా చదవండిః ఉపఎన్నిక షెడ్యూల్ పై పార్టీలకు సంకేతాలందాయా?

Advertisement

తాజా వార్తలు

Advertisement