Monday, December 9, 2024

TTD: ఆధార్ అనుసంధానంతో దళారీలకు చెక్ పెట్టగలమా… టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుపతి : శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్ లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు ఎంతవరకు వీలవుతుందనే అంశంపై దృష్టి సారించాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఐటీ విభాగ నిపుణులతో అన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో ఈరోజు యుఐడిఎఐ (ఆధార్ సంస్థ) నుండి విచ్చేసిన అధికారులు, టిసిఎస్ జియో, టీటీడీ ఐటి విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ… ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్ లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటి అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు సంబంధించి యుఐడిఎఐ అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. ఆధార్ ద్వారా యాత్రికుల గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు.

అంతకుముందు యుఐడిఎఐ అధికారులు ఆధార్ ను ఏ విధంగా అప్లికేషన్ లకు లింక్ చేయవచ్చు, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో యుఐడిఎఐ డిప్యూటీ డైరెక్టర్ సంగీత, అధికారులు, శ్రీనివాస్, రాజశ్రీ గోపాలకృష్ణ, అనుకూర చౌదరి, సంజీవ్ యాదవ్, టీటీడీ జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, సివి అండ్ ఎస్ఓ నరసింహ కిషోర్, రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement