Friday, April 26, 2024

బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో కాదు.. మీ మనవడిని అడుగు: చంద్రబాబుపై బొత్స సెటైర్లు

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు షేర్ చేసుకున్నారు. తన నియోజకవర్గానికి వెళ్లి తానొక‌ పనికిమాలిన వ్యక్తిగా చంద్రబాబు మాట్లాడారని మండిపడ్డారు. పనికిమాలిన తనానికి పేటెంట్ హక్కు చంద్రబాబేన‌ని ఎద్దేవా చేశారు.

ఏపీకి పనికొచ్చే ఒక్క మంచి మాట కూడా చంద్రబాబు మాట్లాడలేదని బొత్స విమ‌ర్శలు గుప్పించారు. ఇక‌.. బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బొత్స దుయ్యబట్టారు. బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకుంటున్నారేమో? అని చంద్ర‌బాబును ఎద్దేవా చేశారు. బైజూస్ అంటే ఏమిటో మీ మనవడిని అడిగితే చెపుతారని సెటైర్లు వేశారు.

మమ్మీ, డాడీ అని పిలవడం కోసం ఇంగ్లిష్ మీడియం అని చంద్రబాబు అంటున్నారని.. అందుకేనా మీ కొడుకుని ఇంగ్లిష్ మీడియంలో చదివించారు? అందుకేనా విదేశాలకు పంపించింది? అని బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు. పేద పిల్లలకు కూడా అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడార‌ని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement