Friday, April 19, 2024

బిజినెస్ మ్యాన్ – పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డంలో సిఎం జ‌గ‌న్ సూప‌ర్ హిట్

అమరావతి, ఆంధ్రప్రభ: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాప్రతినిధికంటే ముందే ఒక పారిశ్రామికవేత్త. పెట్టుబడుదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో ఆమూలాగ్రంగా తెలిసిన వ్యక్తి. తాను కూడా ఒక పెట్టుబడిదారుడిగా తన స్థాయి పెట్టుబడిదారులతోపాటు తనకంటే పెద్ద పెట్టుబడిదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మెళుకువలు కూడా అంతకంటే బాగా తెలుసు. దాదాపు మూడు పదుల వయస్సులోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టి అనేక భారీ పరిశ్రమలను నెలకొల్పిన ఆయన పరిస్థితుల ప్రభావంతో రాజకీయరంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయన పరిపాలనలో కార్పొరేట్‌ తరహా పాలనను జొప్పిస్తూ ‘తానొవ్వక.. ఇతరుల నొప్పింపిక’ అన్న చందంగా పాలన బండిని నెట్టుకొస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికే రాష్ట్ర ఖజానా రూ.100 కోట్లు మాత్రమే. అప్పటికే దాదాపుగా రూ.2 లక్షల కోట్ల అప్పు కూడా ఉంది. అయినా తానెక్కడా అధైర్య పడలేదు. అటు వ్యాపార పరంగా తనకున్న అపార అనుభవాన్ని రంగరించి అధికారులతో నిత్యం సమీక్షలు చేస్తూ ఆదాయ మార్గాలను అన్వేషించారు. ఆయన పాదయాత్రలో ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు బాటలు వేసుకున్నారు. అటు కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ఇటు రాష్ట్రంలో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మూడు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంగా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. ఈక్రమంలోనే తనలోని ఒక పెట్టుబడిదారుడిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక రాజకీయ డ్రామా అంటూ గిట్టనివాళ్లు ప్రచారం చేశారు. అయినా తొణకలేదు..బెణకలేదు..తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో భాగంగా దేశవిదేశాల్లోని పారిశ్రామిక వేత్తలతో నిత్యం సంప్రదింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనే వారుఎందుకు పెట్టుబడులు పెట్టాలో, పెడితే పెట్టుబడులు తిరిగి రావడంతోపాటు లాభాలు ఎలా వస్తాయో కూడా తెలియజెప్పారు. ఇదంతా నెల రోజులుగా చేస్తున్న ఆయన పెట్టుబడిదారులు ఆలోచించుకునేందుకు సమయం ఇచ్చి మరీ సదస్సు పెట్టారు. ఆలోచన చేసిన పెట్టుబడిదారులంతా ఏపీలో పెట్టుబడులు పెడితే తమకు భోరోసా ఉంటుందని భావించేలా చేశారు. సీఎం జగన్‌ చేస్తున్న ఈ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో కూడా వ్యాపార వర్గాలు వేచి చూశాయి. ఆయన నిరంతరం పడిన శ్రమ ఇప్పుడు పరిశ్రమల రూపంలో రాష్ట్రంలో భారీగా కొలువుదీరబోతోంది.. నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల నెరవేరబోతోంది. ఇదంతా గమనించిన దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఇప్పుడు ‘జగన్‌.. ద బిజినెస్‌ మ్యాన్‌’ అంటూ కితాబిస్తున్నారు.

పారిశ్రామిక వేత్తల నోట జగన్‌ మాట :
తాను అనుకున్న దానిని సాధించే క్రమంలో నిరంతరం పరిశ్రమించి విజయం సాధించిన సీఎం జగన్‌, ఇప్పుడు దేశ విదేశాల్లో సుపరిచితమయ్యారు. దేశ విదేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామిక వేత్తలంతా ‘జగన్‌’ నామస్మరణ చేస్తున్నారు. విశాఖ వేదికగా తొలి రోజు జరిగిన సదస్సులో ప్రసంగించిన అనేక మంది దిగ్గజ పారిశ్రామిక వేత్తలు వారి నోటి నుండి ‘సీఎం జగన్‌ కృషి, పట్టుదల భేష్‌’ అంటూ ప్రశంసించడం ఆయన పనితీరుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. ఏపీ ఇన్‌ఫ్రా బేస్‌, వ్యాపార అనుకూల వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని జిందాల్‌ స్టీల్‌ అధినేత నవీన్‌ జిందాల్‌ వ్యాఖ్యానించారు. ప్రోగ్రెసివ్‌ పాలసీ, పెట్టు-బడిదారులకు అనుకూలమైన స్థలాన్ని సృష్టించే సింగిల్‌ విండో పాలసీ ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీ సమృద్ధిగా వనరులు, మౌలిక వసతులతో వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందుతోందన్న ఆయన ఈయాత్రలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నామని, ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికలతో, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్న యువ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సమీప భవిష్యత్‌లో ఏపీని మరింత అభివృద్ధి చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని జీఎంఆర్‌ఒ అధినేత గ్రంధి మల్లిఖార్జున రావు ప్రశంసించారు. తాము విమానాశ్రయం చుట్టూ మెట్రోపాలిస్‌, విమానాశ్రయ నగరాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో పారిశ్రామిక జోన్‌, ఎయిర్‌స్పేస్‌ జోన్‌, విద్య, ఆరోగ్య సంరక్షణ జోన్‌లు ఉంటాయన్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయం విజయాన్ని భోగాపురంలో పునరావృతం చేస్తామన్నారు. ఇది వైజాగ్‌ నగరం అభివృద్ధికి తోడ్పడుతుందని, రాష్ట్రాన్ని అత్యంత ప్రాధాన్య పెట్టు-బడి గమ్యస్థానంగా ప్రపంచ పటంలో ఉంచుతుందన్నారు. రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముకేష్‌ అంబానీ కూడా రాష్ట్రంలో తమ పెట్టు-బడి ప్రణాళికల్ని వివరిస్తూ ముఖ్యమంత్రి పడుతున్న ఆరాటం ఏపీ ప్రజలకు వరంగా మారబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో సహా భారతదేశం అంతటా 2023 చివరిలోపు నిజమైన 5జీ పూర్తి చేస్తామని, ఇందుకు ఏపీ తొలి మెట్టుకావడం, అందుకు సీఎం జగన్‌ ఇనీషియేషన్‌ తీసుకోవడం గర్వకారణమన్నారు. ఇలా దిగ్గజ పెట్టుబడుదారులంతా వారివారి ప్రసంగాల్లో సీఎం జగన్‌ను ప్రశంచడంతోపాటు ఆయన పడిన కష్టాన్ని వివరించారు.

కేవలం ఫోన్‌ కాల్‌ దూరంలోనే :
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కూడా తాను పారిశ్రామికవేత్తలకు కేవలం ఒకే ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటానంటూ భరోసా కల్పించారు. రాష్ట్రంలో ఉన్న విస్తారమైన వనరులు, పెట్టుబడి పాలసీలు, సింగిల్‌ విండో విధానం, అవసరమైన భూమి, విద్యుత్‌, నీరు అందుబాటులో ఉండటం వెరసి ఏపీ పెట్టుబడులకు అనుకూలమని తేల్చి చెప్పారు. వ్యాపారాలు చేసేవారికి మంచి వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉండడమే కాకుండా, ఎప్పుడు ఏం అవసరమైనా సహకారం అందించేందుకు కేవలం మేం ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటామని సీఎం జగన్‌ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement