Tuesday, April 23, 2024

ద‌ళారీ గుప్పెట్లో రెవిన్యూ..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ దాదాపుగా దళారుల గుప్పిట్లోకి వెళ్ల్తోంది. కొన్ని ప్రాంతాల్లో నిజయితీ పరులైన అధికారులు వ్యవస్థ విధివిధానాలను తూచా తప్పకుండా అమలు జరిపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అటువంటి వారిపై ఖద్దరు పెత్తనం పెరుగుతోంది. ఫలితంగా దళారులు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి భూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో రోజుకో అవినీతి భాగోతం వెలుగు చూస్తున్న ప్పటికీ ఉన్నతస్థాయి అధికారులు విచారించి సస్పెన్షన్‌తో సరిపెడుతు న్నారు. దీంతో మరో రెండు, మూడు నెలలు తర్వాత అవినీతికి పాల్పడ్డ రెవెన్యూ అధికారి అదే అవినీతి సొమ్ముతో అంతకంటే మం చి ప్రాంతంలో పోస్టులు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రక్రియలో కొంతమంది అధికారులు శాఖపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ విధి నిర్వహణలో అందిన వరకు బొక్కేస్తూ తిరిగి అడ్డదారిలో అందలమెక్కుతున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న భూ ఆక్రమాల్లో రెవిన్యూ అధికారులు, సిబ్బందితోపాటు దళారులు, అధికార పార్టీ నేతల ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రెవెన్యూ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ రోజురోజుకూ పెరిగిపోతోంది. తాము ఎన్ని అక్రమాలు చేసినా అడిగేవారే లేరన్న ధీమాతో రికార్డులను సైతం తారుమారు చేస్తున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రెవిన్యూ వ్యవస్థలో చోటుచేసుకున్న వివిధ భూ కుంభకోణాల వ్యవహారంలో తహాశీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్వోల స్థాయి కలిగిన అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. మరికొన్ని సందర్భాల్లో క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఆయా భూ ఆక్రమాల్లో తెరవెనుక కీలకపాత్ర పోషించిన దళారులపై మాత్రం ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. అదే విధంగా రెవిన్యూ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి కమిషన్లు ఎరచూపిన స్థానిక నేతలపైనా చూద్దామన్నా ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. దీంతో మండలస్థాయిలో రెవిన్యూ కార్యాలయాలు వద్ద దళారు లదే ఇష్టారాజ్యం అయిపోతోంది. కొన్ని తహశీల్దారు కార్యాలయాల్లో ప్రయివేటు వ్యక్తులు (దళారులు) తిష్ట వేసి కూర్చుంటున్నా కనీసం ఉన్నతస్థాయి అధికారులు తనిఖీల సందర్భంలో కూడా వారి గురించి ఆరా తీయకపోవడం చూస్తుంటే ఆర్డీవో స్థాయిలోనే దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. గత ఏడాది రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భూ ఆక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం కోరడా జులిపించింది. వారిలో ఎక్కువ సంఖ్యలో తహశీల్దార్లే ఉన్నారు. ముఖ్యంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ భూ స్కామ్‌లు చోటుచేసుకోవడంతో వివిధ దశల్లో 12 మందికి పైగా తహసీల్లార్లపై వేటు వేశారు. వారిలో ఆరుమందిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేశారు. అయితే భూ అక్రమాలకు సంబంధించి రికవరీ విషయంలో ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోయారు. కేవలం చర్యలకే పరిమతమయ్యారు. ఫలితంగా కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు పరుల చేతుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

మరి భూముల రికవరీ మాటేంటి..?
రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికే వివిధ అభివృద్ది కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఆయా శాఖలకు కేటాయించింది. అయితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం విలువైన భూములు అలాగే ఉన్నాయి. అయితే ఆ తరహా భూములపై కన్నేసిన కొంత మంది భూ మాఫియా స్థానిక రెవిన్యూ అధికారులతో చేతులు కలిపి గుట్టుచప్పుడు కాకుండా రికార్డులు తారుమారు చేసి సొంత భూములుగా మార్చేసుకుంటు న్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే పెళ్లకూరు, కోట, మనుబోలు మండలాల పరిధిలో జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ప్రభుత్వ భూములకు సంబంధించి రికార్డులు తారుమారు చేశారు. సుమారు 65 కోట్ల రూపాయాల విలువైన భూములను గుట్టుచప్పుడు కాకుండా మాయం చేశారు. అందుకు సంబంధించిన రికార్డును కూడా నిబంధనల మేరుకు సరిచేశారు. ఈ భారీ భూ స్కామ్‌కు సంబంధించి అప్పట్లో ఇద్దరు రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

అయితే భూముల రికవరీ విషయంలో మాత్రం నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే కలవాయి,చేజర్ల, పొదలకూరు, మర్రిపాడు మండలాల పరిధిలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్లో మాయాజాలాన్ని ప్రదర్శించారు. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు సంబంధించి ముంపు పరిహారం చెల్లింపు ప్రక్రియలో కూడా ప్రభుత్వ భూములను ప్రయివేట్‌ భూములుగా చూపి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారం పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారుల విచారణకు ఆదేశించారు. ఆ విచారణలో ముగ్గురు తహశీల్లార్లు అవినీతికి పాల్పడ్డారని నిర్దారణ అయ్యింది. దీంతో వారిపై సస్పెన్షన్‌ వేటుతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అయితే అడ్డదారిలో ధారాదత్తం చేసిన భూములు పరిహారం విషయంలో ప్రభుత్వ నిధుల్ని దోచుకున్న వ్యవహారంలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా అక్రమాలు జరుగుతున్నప్పటికీ కేవలం సస్పెన్షన్లతోనే సరిపెడుతు న్నారనే తప్ప ప్రభుత్వ భూములను తిరిగి రికవరి చేసే విషయంపై దృష్టి సారించడం లేదు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement