Wednesday, April 24, 2024

నల్లబెల్లం నిల్వ, రవాణా నేరం కాదు.. జప్తు చేయటానికి వీల్లేదు: హైకోర్టు

అమరావతి, ఆంధ్రప్రభ: నల్లబెల్లం కలిగి ఉండటం.. రవాణా ఎంతమాత్రం నేరకాదని హైకోర్టు స్పష్టం చేసింది. నల్లబెల్లం నిల్వలను జప్తు చేయటానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సంతపేట మార్కెట్‌లో బెల్లం వ్యాపారం చేస్తున్న వాసిరెడ్డి గంగరాజు దుకాణంలో ఈ ఏడాది మార్చి 12వ తేదీన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు తనిఖీలు నిర్వహించి షాపులో నిల్వవున్న 25,250 కిలోల నల్లబెల్లాన్ని జప్తు చేశారు. ప్రొహిబిషన్‌ సవరణ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందనరావు విచారణ జరిపారు. పిటిషనర్‌ తరుపు న్యాయవాది రాజా దామోజీరావు వాదనలు వినిపించారు. నల్లబెల్లం నిషేధిత సరకుకాదని ప్రభుత్వమే జీవో జారీ చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అధికారులు జప్తుచేసిన స్టాకును అలాగే ఉం చటంతో నిరుపయోగంగా మారుతుందని దీనివల్ల పిటిషనర్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నల్లబెల్లం కలిగి ఉండటం, రవాణఆ చేయటం కారణాలతో జప్తు చేయటానికి వీల్లేదన్నారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న సరకును తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ నల్లబెల్లం కలిగి ఉన్నా, రవాణా చేసినా జప్తు చేయటానికి వీల్లేదనే వాదనతో ఏకీభవించారు. అయితే పెద్దమొత్తంలో ఆ బెల్లాన్ని ఎక్కడి నుంచి తెచ్చారో వివరించాలని మాత్రమే ఎస్‌ఈబీ అధికారులు కోరారన్నారు. పిటిషనర్‌ ఆధారాలు చూపనందునే జప్తు చేశారన్నారు. దీనిపై పిటిషనర్‌ తరుపు న్యాయవాది స్పందిస్తూ తమకు అవకాశం ఇస్తే అధికారులకు ఆధారాలను సమర్పించేందుకు సిద్ధమే అని ప్రకటించారు. వాదనలు విన్న న్యాయమూర్తి నల్లబెల్లం కలిగి ఉన్నా, రవాణా చేసినా నేరంకాదని అధికారులు జప్తుచేసిన స్టాకును పూచీకత్తుతో విడుదల చేయాలని ఎస్‌ఈబీని ఆదేశించారు. పూచీకత్తుపై విడుదల ఎస్‌ఈబీ అధికారులు నమోదు చేసిన కేసు తుది ఫలితానికి లోబడి ఉంటుందని స్పష్టంచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement