Friday, March 29, 2024

సీమ ప్రాంత అభివృద్ధిపై బీజేపీ ప్రత్యక దృష్టి .. టీజీ వెంక‌టేష్‌

సీమ ప్రాంత అభివృద్ధి పై బీజేపీ ప్రత్యక దృష్టి సారించిందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆదోనిలో జరిగిన భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ… తాను మంత్రిగా ఉన్న కాలంలో ఆదోని ప్రాంత అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నో ఎత్తిపోతల పథకాలు కూడా ఈ ప్రాంతానికి మంజూరు చేయడం జరిగిందన్నారు. తర్వాత కాలంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడినట్లు పేర్కొన్నారు.

ఈ ప్రాంత అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టి రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక డిక్లరేషన్ చేసిందన్నారు. అపారమైన ఖనిజ సంపద, పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనకబాటుకు గురైనట్లు పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల‌న్నీ పూర్తిచేసి నీటిని సక్రమంగా వినియోగించుకోగలిగితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బలమైన నాయకత్వం అవసరమన్నారు. ప్రజాస్వామ్యంలో అనుక్షణం ప్రజల కోసం పరితపించే వారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, చిరంజీవి రెడ్డి, చంద్రమౌళి, విట్ట రమేష్, పార్థసారథి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement