Friday, March 29, 2024

గణనాథుడి చుట్టూ ఏపీ పాలిటిక్స్ !

ఏపీ రాజకీయాలు వినాయకుడి చుట్టూనే తిరుగుతున్నాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరించిన నేపథ్యంలో పండుగపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించవద్దని.. ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఊరేగింపులు, నిమజ్జనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ తీరుపై పార్టీలే కాదు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం బీజేపీ ఆందోళనలకు పిలుపునివ్వడంతో రాజకీయాలన్నీ వినాయకుడి చుట్టూనే తిరుగుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ నాయకులు ఏపీ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించారు. మండపాల్లో ఉత్సవాల నిర్వహణకు అనుమతివ్వాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. 

వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకి కావడం వల్లనే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వినాయక చవితి వేడుకలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడని మండిపడుతున్నారు. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే బీజేపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగింది. కర్నూలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. వినాయక చవితి వేడుకలు రద్దు చేయడం వెనుక కుట్ర ఉందని సోము వీర్రాజు ఆరోపించడం రాజకీయం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. గణేశ్​ విగ్రహాన్ని తలపై పెట్టుకుని విశాఖ కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. సోము వీర్రాజు అరెస్టును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి: అడ్డమైన కారణాలతో పెన్షన్లు తొలగిస్తున్నారు: లోకేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement