Thursday, October 24, 2024

Bhimavaram – రూ 35 కోట్లతో మరో బుకీ గాయబ్


  • రూ.35 కోట్లు మాయం
    కమీషన్ బదులు మొత్తం స్వాహ
  • నూజివీడులో మధ్యవర్తి అనుమానాస్పద మృతితో
    భీమవరంలో కలకలం.. కలవరం
    కడకు రెడ్డి కాదు.. రాజు అని ఊరట

( ఆంధ్రప్రభ స్మార్ట్, భీమవరం ప్రతినిధి )
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల లో కూటమి ప్రభుత్వం అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పందెం రాయుళ్లు అంచనాల తారుమారు అయ్యాయి. రూ. కోట్లలో పందాలు వేసిన పందెం రాయుళ్లకు కొన్నిచోట్ల గెలిచినా చేదు ఫలితాలు ఎదురయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పందెం రాయుళ్లకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి సుమారు రూ.35 కోట్లతో పరారయ్యాడు. అతని కోసం పందెం రాయుళ్లు ఐదు రోజులుగా గాలిస్తూనే ఉన్నారు. తాజాగా నూజివీడులో ఇదేవిధంగా పందాలకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి అనుమాదానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

భీమవరంలో హమ్మయ్య…

భీమవరంలో పందాలకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ఓ రాజు కావటం, నూజివీడులో మృతి చెందిన వ్యక్తి స్థానికంగా ఉండే ఓ రెడ్డి అని తేలడంతో భీమవరం పందెం రాయుళ్లు ఊపిరి పీల్చుకున్నారు. తాము పందెం కాసిన రాజు కోసం వెతుకులాట మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల గెలుపోవటములపై భీమవరం, భీమవరం పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులే కాకుండా సమీపంలోని జిల్లాలకు చెందిన కొందరు వ్యక్తులు కూడా భారీ స్థాయిలో పందాలు వేసినట్లు సమాచారం.

- Advertisement -

కమీషన్ సరే.. మొత్తం గల్లంతు

ఈ పందాలకు సంబంధించి భీమవరంలోని రాయలం ప్రాంతానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మధ్యవర్తిగా వ్యవహరించాడు. పందెం వేసిన ఇరు వర్గాల నుంచి నగదును తన వద్ద భద్రపరిచినందుకు, మధ్యవర్తిగా వ్యవహరించినందుకు గాను గెలిచిన అభ్యర్థికి చెల్లించే నగదులో ఐదు శాతం కమిషన్ తీసుకుని చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.

అంతా సక్రమంగానే జరిగిన ఈ వ్యవహారంలో ఫలితాలు వెలువడగానే మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి పందెం రాయుళ్ల డబ్బుతో పరారయ్యాడు. ఈ వ్యక్తి కి రెండు ప్రధాన పార్టీల నుంచి కీలక నేతల మద్దతు, అండదండలు మెండుగా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.ఈ పరారైన వ్యక్తి కారణంగా ముఖ్య ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వ్యక్తులు కూడా రూ. లక్షలలో నష్టపోయినట్లు సమాచారం.

జువ్వలపాలెం రోడ్ లో ఉండే ఓ ముఖ్య నాయకుడు తాను వేసిన సుమారు రూ.25 లక్షల సంబంధించిన పందెం డబ్బులు రాకపోవడంతో తన పరిస్థితిని తన సన్నిహితుల చెప్పుకొని గోడును వెళ్ళబోసుకుంటున్నాడు. అంతా తెలిసిన వ్యక్తి ఇలా పరారైపోతాడని అనుకుంటామంటూ బాధను వెల్లబోసుకుంటున్నాడు.

పందెం రాయుళ్లు లబోదిబో

ఇదేవిధంగా కొంతమంది రూ.కోట్లలో మోసపోయిన పందెం రాయుళ్లు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేక, మధ్యవర్తిగా వ్యవహరించిన కుటుంబ సభ్యులను నిలదీయలేక గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తమకు రావలసిన నగదు చెల్లించుకుంటే ఎటువంటి దారుణాలు జరుగుతాయో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. తమను ఇంత మోసం చేస్తాడా అంటూ పందెం రాయుళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పందెం కోసం కొందరు తమ ఆస్తులను తనఖా పెట్టి, ప్రాంసరీ నోట్లపై వడ్డీకి అప్పులు తెచ్చి మరి నగదును జమ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement