Friday, April 19, 2024

గేటు పడిందా.. ఆగి వెళ్లండి – లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద జాగ్రత్త.. రైల్వే అవగాహనా వారోత్సవాలు

అమరావతి, ఆంధ్రప్రభ: రైల్వే లెవల్‌ క్రాసింగుల వద్ద గేటు పడినా దాటే ప్రయత్నం చేయడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటి నివారణే లక్ష్యంగా అంతర్జాతీయ లెవల్‌ క్రాసింగ్‌ అవేర్‌నెస్‌ వీక్‌ నిర్వహిస్తున్నామని విజయవాడ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ శివేంద్ర మోహన్‌ తెలిపారు. ఈ నెల మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించిన వారోత్సవాల ముగింపు సందర్భంగా విజయవాడ డీఆర్‌ఎం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ మూసి ఉన్న గేటు దాటడం ఆత్మహత్యాసదృశమని, రైలు ఎంత దూరంలో ఉందో, ఎంత వేగంతో వస్తుందో తెలియకుండా దాటే ప్రయత్నం చేస్తూ ఏటా అనేక మంది ప్రమాదాలబారిన పడుతున్నారని వివరించారు. మూసి ఉన్న గేటు దాటడం శిక్షార్హమైన నేరమన్నారు. గతంలో కాపలా లేని లెవల్‌ క్రాసింగ్స్‌ ఉండేవని, ప్రస్తుతం డివిజన్‌ పరిధిలో ఉన్న 424 క్రాసింగ్స్‌లో గేట్‌మెన్లు పని చేస్తున్నారని చెప్పారు. మూసి ఉన్న గేటు తెరవాలంటూ గేట్‌మెన్ల మీద ఒత్తిడి తేవడం సరికాదని, అలాగే హారన్‌లు కొడుతూ సౌండ్‌ పొల్యూషన్‌ చేయడం తగదని, రైలు గేట్లన్నీ లాకింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తాయని, గేట్‌మెన్‌ తెరవాలనుకున్నా నిర్దేశిత సమయం పూర్తి కాకుండా ఆ పని చేయలేరని స్పష్టం చేశారు.

ఈ విషయాలపై పాదచారులు, వాహనదారులకు ఈ వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అలాగే పాంప్లెట్లు పంచడం, సెమినార్లు నిర్వహించడం, డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించడం చేశామన్నారు. ప్రమాదాల నివారణ కోసం అవకాశం ఉన్న చోట్ల ఆర్‌యూబీలు, డైవర్షన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడేళ్లలో 15 ప్రాంతాల్లో ఆర్‌యూబీలు నిర్మించి, లెవల్‌ క్రాసింగ్‌లను పూర్తిగా మూసివేశామని వివరించారు. భవిష్యత్తులో రైళ్ల వేగాన్ని 130 కిలోమీటర్లకు పెంచాలని భారతీయ రైల్వే భావిస్తోందని, ఈ నేపథ్యంలో ప్రజల్లో లెవల్‌ క్రాసింగ్‌ల పట్ల మరింత అవగాహన పెరగాల్సి ఉందని డీఆర్‌ఎం శివేంద్ర మోహన్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement