Thursday, April 18, 2024

రైతన్నకు వెన్నుదన్ను.. యంత్రసేవా పథకం ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ : గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ట్రాక్టర్‌ డీలర్లతో కుమ్మక్కై కుంభకోణాలకు పాల్పడితే.. వ్యవసాయానికి అండగా, రైతన్నలకు భరోసా కల్పించేందుకు తాము ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. గుంటూరులోని చుట్టుగుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెగామేళాలో మంగళవారం డాక్టర్‌ వైఎస్సార్‌ యంత్ర సేవా పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రైతు గ్రూపులకు పంపిణీ చేసే ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకొరగా ట్రాక్లర్లు ఇచ్చి డీలర్ల వద్ద తెలుగుదేశం ప్రభుత్వం కమిషన్లు మింగేస్తే వైసీపీ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది.. రాష్ట్ర రైతాంగం అప్పటికీ, ఇప్పటికీ తేడాను గమనించాలన్నారు. ట్రాక్టర్లతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలు ఏవి కావాలన్నా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారీ వ్యవస్థను ఏర్పాటు చేశాం.. రైతు తనకిష్టమైన ఏ కంపెనీ ట్రాక్లర్‌ నయినా, ఏ పనిముట్టునయినా ఆర్డర్‌ చేసేలా వీలు కల్పించాం.. రైతు తమకు ఇష్టమొచ్చిన వ్యవసాయ యంత్ర పరికరాలను కొనుగోలు చేస్తే ప్రభుత్వం నేరుగా ఆ రైతుకే సబ్సిడీ అందిస్తుందని జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న వైయస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా రైతు గ్రూపులకు ఆర్బీకే స్థాయిలో 3800 ట్రాక్టర్లు, ఆర్బీకే స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు వ్యవసాయ ఉపకరణాలు, క్లస్టర్‌ స్థాయిలో 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల సబ్సిడీని కూడా జమ చేసినట్టు తెలిపారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు.. ట్రాక్టర్లతో సహా ఇతర యంత్ర పరికరాల విలువలో 40 శాతం రాయితీ ఇస్తాం.. మరో 50 శాతం అతి తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణం అందేలా చేస్తాం.. వ్యవసాయ యంత్ర ఉపకరణాలన్నీ ఆర్బీకే పరిధిలో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జగన్‌ స్పష్టం చేశారు.

దీనిలో భాగంగా రూ.2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్ధాయిలో రూ.15 లక్షల విలువగల 10,750 వైయస్సార్‌ యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షలు విలువ గల కంబైన్‌ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్‌ స్ధాయి యంత్రసేవా కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 6780 ఆర్బీకేల పరిధిలో, మరో 391 క్లస్టర్‌ స్దాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల పరిధిలో సుమారు రూ.700 కోట్ల విలువ గల ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,750 రైతు భరోసా కేంద్రాల్లో యంత్ర సేవా పథకం సేవలు అందుతాయన్నారు. రైతాంగ సంక్షేమం, అభివృద్ధి కోసం పారదర్శక విధానాల ద్వారా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థ ద్వారా అన్ని ప్రయోజనాలను రైతులకు చేరువ చేస్తున్నట్టు సీఎం జగన్‌ తెలిపారు.

సబ్సిడీ విడుదల..

ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం తరపున 40 శాతం సబ్సిడీని సీఎం జగన్‌ పంపిణీ చేశారు. మొత్తం రూ 590 కోట్ల విలువైన యంత్ర పరికరాలకు సంబంధించి రూ 175 కోట్ల సబ్సిడీని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు జమ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement