Wednesday, April 24, 2024

మాన్సాస్ ఛైర్మెన్ కు అవమానం.. ప్రభుత్వ తీరుపై అశోక్ గజపతిరాజు ఫైర్

ఏపీ హైకోర్టు తీర్పుతో సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా మళ్లీ బాధ్యతలు చేపట్టిన టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదు. నిన్న సింహాచలంలో నేడు మాన్సాస్ ట్రస్ట్ లోనూ అశోక్ గజపతి రాజుకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి. అధికారులు కనీసం ఆయనను పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.కోర్టు తీర్పు తరువాత మాన్సాస్ ఛైర్మెన్‌గా అశోక్ గజపతిరాజు సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి మాన్సస్ ఈవో వెంకటేశ్వర రావు, కరెస్పాండెంట్ కేవీఎల్ రాజు గైర్హాజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రస్ట్ నిర్వహణలో అధికారులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాన్సాస్‌లో ఆడిట్ జరగలేదంటే ఆశ్చర్యపోయానన్నారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్ధ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లించామన్నారు. దోపిడిదారులకు మాన్సాస్‌లో స్థానం లేదని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. అలాగే రామతీర్థం విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ చైర్మెన్‌గా తమ ప్రథమ ప్రాధాన్యం విద్యకేనన్నారు. దాని కోసం ప్రభుత్వ సహకారాన్ని కూడా అర్ధిస్తామన్నారు.

హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు దాడులు చేస్తోందని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. దుండగుల దాడిలో రాముని శిరస్సు ఖండించిన వారిని పట్టుకోకపోగా.. ఆలయ బాగు కోసం విరాళం ఇచ్చినా తిరస్కరించటం తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. దేశంలో ఇంకా హిందూ మతం బతికుండటంతో ఆ విరాళం అయోధ్యలో సమర్పించామన్నారు. మహారాజకోటలో చారిత్రక మూలాలు ధ్వంసం చేశారన్నారు. సింహాచలం దేవస్థానం వద్ద ఆలయ ఈవో కూడా తనను కలవడానికి ఇష్ట పడలేదన్నారు. మాన్సస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలని అశోక్ గజపతి రాజు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement