Friday, March 29, 2024

Ashok Gajapathi: కేసుల బెదిరింపులకు భయపడం

రామతీర్థంలో శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై పోలీస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు.  పూజ కార్యక్రమాలకు అడ్డు తగిలినట్లు నిరూపిస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు. కేసుల బెదిరింపులకు భయపడని, కేసులు పెట్టడం ప్రభుత్వానిది కొత్త పద్ధతి అని చెప్పారు. ఈవోపై ఒత్తిడి తెచ్చి తనపై కేసు పెట్టించారని ఆరోపించారు. హిందూ మతాన్ని కాపాడేందుకే తమ పోరాటం అని తెలిపారు. తనపై ప్రభుత్వం వ్యక్తిగతంగా దృష్టి సారించిందని చెప్పారు.

శంఖుస్థాపన జరిగిన చోట కనీసం బూట్లు, చెప్పులు కూడా వదలలేదని మండిపడ్డారు. ఆనవాయితీలు, సంప్రదాయాలు మంట కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో దేవాదాయ అంశం భాగం కాదని చట్టాలు చెబుతున్నా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆలయ పునఃనిర్మాణానికి వినియోగిస్తున్న రూ.3 కోట్ల నిధులు ప్రభుత్వ డబ్బు కాదన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వాడుతున్న భాష తనకు రాదని పేర్కొన్నారు. ప్రభుత్వ జీఓ ల విషయంలోనూ రహస్యం వ్యవహరిస్తున్న మంత్రులు నీతి వ్యాఖ్యలు పలకడం విడ్డురంగా ఉందని విమర్శించారు.

జిల్లాకు సంబంధించిన మంత్రి తమ కుటుంభాన్ని  అవమానించారన్నారు. తనను ఎలా పెంచారో అందరికి తెలుసున్నారు. ఎవరూ మంత్రిగా ఉన్నా గౌరవించాలి, కానీ ఊడిగం చేయకూడదన్నారు. పదవులు చేపట్టిన సందర్భంలో రాజ్యాంగంపై ప్రమాణం చేస్తున్నారు కానీ వాటికి విలువలు లేకుండా పోతుందన్నారు. జీవోలు ఆన్ లైన్ లో పెట్టకూడదని నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ అంశంలో చంద్రబాబు నాయుడుని కూడా లాగుతున్నారని మండిపడ్డారు. విరాళం కింద కాకుండా స్కీమ్ కింద తీసుకుంటామనడం ఏంటి ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పటిస్తోందన్నారు. అన్ని మతాలను గౌరవించడం ధర్మం అన్నారు. హిందూ ధర్మం కోసం ఎన్ని అవమానాలు చేసినా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటానని అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు.

కాగా, టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజుపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం(డిసెంబర్ 22) రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement