Thursday, April 25, 2024

Cyclone Asani: తీరం దాటిన అసని తుపాను.. భారీ వర్షాలు కురిసే అవకాశం

అసని తుపాను తీరం దాటింది. మచిలీపట్టణానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. కాకినాడకు పశ్చిమ-నైరుతి దిశలో 120 కిలోమీటర్ల దూరంలో తీవ్ర అల్పపీడనం నెలకొందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అయితే, ఈ రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అసని తుపాను తీవ్ర వాయుగండంగా మారినప్పటికీ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు.

మరోవైపు తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో అత్యధికంగా 15.5 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. భారీ వర్షాల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావంతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో ఉప్పాడ-కొత్తపల్లి రహదారి ధ్వంసమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement