Sunday, June 4, 2023

కార్తీక పౌర్ణమికి సూర్యలంకలో ఏర్పాట్లు

బాపట్ల : కార్తీక పౌర్ణమి కి సూర్యలంక ముస్తాబవుతుంది. ఉప సభాపతి కోన రఘుపతి సముద్రంకు వచ్చే పర్యాటకులకు ప్రత్యేక వసతులు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు, పర్యాటకులు శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున సూర్యలంక సముద్రతీరంలో స్నానాలాచరించేందుకు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ఉప సభాపతి కోన రఘుపతి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ నిధి మినా నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, తహశీల్దార్ శ్రీ చరణ్, ఎంపీడీవో రాధాకృష్ణ ఇతర శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ నేతృత్వంలో సుమారు 250 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుటుంబ సమేతంగా సముద్రుడికి, సూర్యుడుకి తెల్లవారుజామున ఐదున్నర గంటలకు ప్రత్యేక కర్పూర హారతులు ఇవ్వనున్నారు.

- Advertisement -
   

తీరంలో ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ… కార్తీక పౌర్ణమి రోజున పటిష్ట బందోబస్తు తోపాటు సిసి కెమెరాల నిఘాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముంద‌ని, అందుకు తగ్గట్టుగా ఉప సభాపతి కోన రఘుపతి, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో 20 బస్సులు సూర్యలంకకు ప్రత్యేకంగా కేటాయించామని ఆర్టీసీ బస్సులో వచ్చే ప్రయాణికులకు సూర్యలంక తీరం వరకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. తీరం వద్ద ఎటువంటి చోరీలు, గొడవలు జరగకుండా చూసేందుకు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని, నిఘా కళ్ళతో పోలీసులు పర్యవేక్షిస్తారన్నారు. వాహనాలలో తీరం కు వచ్చే పర్యాటకులు పోలీసులు సూచించిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలు నిలుపుదల చేసుకోవాలని, రోడ్లపై ఎక్కడా కూడా నిలుపుదల చేయవద్దని సూచించారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటారని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారన్నారు. చిన్నారులతో తీరంకు వచ్చే తల్లిదండ్రులు చిన్నారుల పట్ల జాగ్రత్తలు పాటించాలని, మోకాళ్ళు లోతుకు మించి లోతుకు వెళ్లవద్దని ఆయన కోరారు. పర్యాటకులు, భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement