Friday, December 6, 2024

AP – పోలీసుల‌కు చిక్కిన వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి

కడప: వైసిపి సామాజిక మాధ్యమ కార్యకర్త, సోషల్ మీడియా సైకోగా పేరొందిన వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు చిక్కాడు.. ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులోని మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో అతడిని పట్టుకున్నారు. రవీందర్రెడ్డిని రేపు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశముంది. రెండు రోజుల క్రితం కడప పోలీస్ స్టేషన్ నుంచి అతడు తప్పించుకున్న సంగతి తెలిసిందే. అతడిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు హైదరాబాద్, బెంగళూరుతో పాటు కమలాపురం, పులివెందుల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.

వర్రా రవీందర్రెడ్డి సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్ తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపై సోషల్ మీడియాలో అత్యంత హేయంగా, జుగుప్సాకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

ఆయనపై మంగళగిరి, హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని కడప పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు వదిలేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా స్పందించారు. కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ను కడపకు పంపి ఆయన ఇచ్చిన నివేదిక మేరకు జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు మరికొన్ని చర్యలకు ఉపక్రమించింది. పులివెందులకు చెందిన వైకాపా కీలక నేతతో పోలీసులు చేసుకున్న లోపాయికారి ఒప్పందంతో 41-ఏ నోటీసులిచ్చి వదిలేసినట్లు ఆరోపణలున్నాయి.

నోటీసులిచ్చి వదిలేసే సమయంలో మరో కేసులో అరెస్టు చేసేందుకు రాజంపేట పోలీసులు కడపకు రాగా, కడప పోలీసులు వారికి అప్పగించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో రవీందర్రెడ్డి పారిపోయాడు. తాజాగా అత‌డిని ప‌ట్టుకున్నారు పోలీసులు .

Advertisement

తాజా వార్తలు

Advertisement