Thursday, January 16, 2025

AP – ఉప్పాడ తీర ప్రాంతం లో సముద్రపు కోత – భయం గుప్పిట్లో ప్రజలు

కాకినాడ – ఫెంగల్ తుపాన్ ప్రభావంతో ఉప్పాడ తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. కెరటాల ఉధృతికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు కోతకి గురైంది.

ఈ ఫెంగల్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరపు ప్రాంత మత్స్యకారులు, గ్రామస్థులు నిత్యం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ తమ ఇళ్లు, భూములు సముద్రంలో కలిసి పోతాయోనని బెంబేలెత్తిపోతున్నారు.

నెల రోజులు వ్యవధిలో రెండు తుపాన్లు :

ఫెంగల్ తుపాన్ ప్రభావం కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై తీవ్రంగా చూపింది. గత రెండు రోజులుగా సముద్రంలోని పెను మార్పులు ఏర్పడి రాకాసి అలలు తీవ్ర ప్రభావం చూపాయి. కెరటాల తాకిడికి తీర ప్రాంత గ్రామాలు కోత బారిన పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, గృహాలు, చెట్లు నేలకొరిగి సముద్రంలో కలిసిపోయాయి. బాధితులు నిలవడానికి నీడ లేక రోడ్డున పడ్డారు.

- Advertisement -

ప్రధానంగా ఉప్పాడ, మాయాపట్నం సూరాడపేట, కోనపాపపేట గ్రామాలు కోత బారిన పడ్డాయి. నెల రోజుల వ్యవధిలో రెండు తుపాన్ల ప్రభావం తీర ప్రాంత గ్రామాలపై పడటంతో మత్స్యకార కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నాయి

మాయ పట్నం, అమీనాబాద్, సూరాడపేట, జగ్గరాజుపేట, కొత్తపట్నం, సుబ్బంపేటలలో మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మత్స్యకారుల బోట్లు తీరంలోనే ఉన్నాయి. అలల తాకిడికి చెల్లాచెదురు అయిన తీర ప్రాంతంకి జియో ట్యూబు రాళ్లు రక్షణగా వేశారు.

రక్షణ గోడ నిర్మాణం ప్రారంభిస్తాం :టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వర్మ

తీర ప్రాంత గ్రామాల్లో, కోతకు గురైన మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వర్మ. కోత ప్రభావాన్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడ్డారు. గృహాలు కోల్పోయిన వారికి సురక్షిత ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం నివారణకు చర్యలు చేపట్టిందని తెలిపారు. త్వరలోనే రక్షణ గోడ నిర్మాణం ప్రారంభిస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement