Friday, October 4, 2024

AP/TG – విజ‌యా డెయిరీకి మ‌హ‌ర్ద‌శ‌! …. ఆ నెయ్యినే ఉప‌యోగించాలి

ఆ నెయ్యినే ఉప‌యోగించాలి
ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రుల‌ నిర్ణ‌యం
ఆల‌య ప్ర‌సాదాల్లో వాడేందుకు ఆదేశాలు
స‌హ‌కార రంగం డెయిరీకి మంచి రోజులు
పూర్తి స్థాయిలో స‌ప్ల‌య్ చేస్తే లాభాల్లోకి విజ‌యా
బ్లాక్ లిస్టులోకి చేరిన‌ ఏఆర్ నెయ్యి
క‌ల్తీ నెయ్యి స‌ప్ల‌య్ చేశార‌నే ఆరోప‌ణ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, నెట్‌వ‌ర్క్:
తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వివాదంతో అన్ని ఆల‌యాల‌ను ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం చేశాయి. ఇప్ప‌టికే స‌రుకుల నాణ్య‌త‌పై కొంద‌రు ఈఓలు ఫుడ్ ఇన్‌స్పెక్ట‌ర్ల ద్వారా త‌నిఖీలు చేయించి చ‌ర్ల‌ప‌ల్లి లేబ్‌కు పంపించారు. స‌హ‌కార రంగంలో ఉన్న డెయిరీల త‌యారు చేస్తున్న నెయ్యిని మాత్ర‌మే వినియోగించాల‌ని దేవ‌స్థానం అధికారుల‌కు ఏపీ, తెలంగాణ‌ ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -

విజ‌య డెయిరీ నెయ్యి వినియోగించాలి…

రెండు రాష్ట్రాల్లో స‌హ‌కార సంఘ రంగంలో ఉన్న విజ‌యా డెయిరీ నెయ్యిని విన‌యోగించాల‌ని ప్ర‌భుత్వాలు ఆదేశించాయి. ప్రైవేటు రంగంలో ఉన్న డెయిరీ నెయ్యిని వినియోగిస్తే ఉపేక్షించేది లేద‌ని హెచ్చరించాయి. టెండ‌ర్లు నిర్వ‌హించొద్ద‌ని సూచించాయి. దీంతో విజ‌య డెయిరీకి మ‌హ‌ర్ద‌శ ప‌ట్టింద‌ని చెప్పొచ్చు.

బ్లాక్ లిస్టులో ఏఆర్ నెయ్యి

తిరుమ‌ల‌కు నెయ్యి స‌ర‌ఫ‌రా చేసిన ఏఆర్ డెయిరీని ఏపీ ప్ర‌భుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే బ్లాక్ లిస్టులో ఉన్న ఏపీ డెయిరీ నెయ్యిని ఎట్టి ప‌రిస్థితుల్లో వినియోగించొద్ద‌ని ఆల‌య అధికారుల‌కు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రించాయి.

ఏపీలో ఆల‌యాల జాబితా..

క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి ఆల‌యం (విజ‌య‌వాడ‌), వేంక‌టేశ్వ‌ర ఆల‌యం (ద్వార‌క‌తిరుమ‌ల‌), స‌త్య‌నారాయ‌ణ స్వామి ఆల‌యం (అన్న‌వ‌రం), సూర్యానారాయ‌ణ స్వామి దేవాల‌యం ( అర‌స‌వ‌ల్లి), పంచ‌రామ దేవాల‌యాలు ( అమ‌రావ‌తి, భీమ‌వ‌రం, పాల‌కొల్లు, సామ‌ర్లకోట‌, ద్రాక్ష‌రామం), సీతారామాల‌యం (రామ‌తీర్థాలు) , కూర్మ‌నాథ‌స్వామి ఆల‌యం (శ్రీ‌కూర్మం), శ్రీ‌ముఖ‌లింగేశ్వ‌ర ఆల‌యం ( శ్రీ‌ముఖ‌లింగం) , సీతారామా ఆల‌యం (ఒంటిమిట్ట‌), రాఘవేంద్ర స్వామి ఆల‌యం (మంత్రాల‌యం) .. ఇట్లా ఏపీలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌న్నిటికీ విజ‌యా డెయిరీ నెయ్యినే వాడ‌నున్నారు.

తెలంగాణ‌లో ఆల‌యాల జాబితా

తెలంగాణ‌లో 12 దేవాలయాలకు ఏటా కోటి రూపాయాల ఆదాయం లభిస్తోంది. 20 దేవాలయాలు 50 లక్షలు.. మరో 325 దేవాలయాలు 24 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాయి. తెలంగాణ‌లో ల‌క్ష్మీ న‌ర‌సింహా ఆల‌యం (యాద‌గిరి గుట్ట‌), శ్రీ సీతారామా ఆల‌యం (భ‌ద్రాచ‌లం), రాజేశ్వ‌రా స్వామి దేవ‌స్థానం (వేముల‌వాడ‌), స‌ర‌స్వ‌తీ అమ్మావారి ఆల‌యం (బాస‌ర‌), భ‌ద్ర‌కాళీ ఆల‌యం (హ‌నుమ‌కొండ‌), పెద్ద‌మ్మ‌గుడి ఆల‌యం (బంజ‌రాహిల్స్‌)తోపాటు హైద‌రాబాద్‌లో ప‌లు దేవాల‌యాలు ఈ జాబితాలో ఉన్నాయి.

విజ‌యా డెయిరీకి మంచి రోజులు

తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి నేప‌థ్యంలో విజ‌యా డెయిరీని ఆదుకోవ‌డానికి ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు ముందుకొచ్చాయి. విజ‌యా డెయిరీ నెయ్యి వినియోగించాల‌ని రెండు ప్ర‌భుత్వాలు ఆదేశించాయి. ఇప్ప‌టికే న‌ష్టాల్లో న‌డుస్తున్న ఈ డెయిరీకి ఆర్థిక ప‌రిపుష్ఠి క‌లుగుతుంద‌న‌డంతో సందేహం లేదు. ఈ నేప‌థ్యంలో విజ‌యా డెయిరీ యాజ‌మాన్యం కూడా నాణ్య‌త లోపం లేకుండా నెయ్యి స‌ర‌ఫ‌రా చేయ‌గ‌లిస్తే లాభాలు బాట‌లోకి వెళ్ల‌డం ఖాయం. ఇన్నాళ్లకు విజ‌యా డెయిరీకి మంచి రోజులు వ‌చ్చిన‌ట్ల‌యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement