Monday, April 15, 2024

అవార్డులు వచ్చేది అందుకేనా? : ఏపీ పోలీసులపై అచ్చెన్న నిప్పులు

ఏపీ పోలీసులు, వైసీపీ నేత‌ల‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల‌పై దాడులు జ‌రుగుతున్నా… పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తుండ‌డం శోచ‌నీయ‌మ‌ని ఆయ‌న అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ దాడులు పెరిగిపోయాయని, దాడులకు స‌హ‌క‌రించిన‌ ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. అధికారం ఉంది క‌దా అని దారుణాల‌కు పాల్పడితే భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా ప్రతిఫలం అనుభవిస్తార‌ని వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలోని కొప్పర్రులో త‌మ పార్టీ నాయ‌కురాలు శారద ఇంటిపై దాడి చేశార‌ని ఆయ‌న అన్నారు. ఇల్లు, బైక్‌లు తగులబెట్టారని, ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నప్ప‌టికీ ప్రేక్షకపాత్ర వహించారని ఆయ‌న ఆరోపించారు.

టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.  ఇంత జ‌రుగుతున్న‌ప్ప‌టికీ పోలీసులు ఏం చేస్తున్నారని ఆయ‌న ప్రశ్నించారు.  దాడులు జరుగుతున్నందుకే ఏపీ పోలీసులకు అవార్డులు వ‌స్తున్నాయా? అని నిలదీశారు. దాడుల‌కు పాల్ప‌డ్డ వారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాల‌ని, లేదంటే ఏపీ వ్యాప్తంగా నిర‌స‌న‌లు తెలుపుతామ‌ని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement