Thursday, December 5, 2024

AP – తిరుమ‌ల త‌ర‌హాలోనే శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం – చంద్ర‌బాబు

శ్రీశైల ఆలయం , ఆలయ పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం మంత్రులు ఆనం రామనారాయణ, కందుల దుర్గేశ్‌, జనార్దన్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు.
శ్రీశైలంలో మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఎంపీలు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు తీసుకొని ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అటవీ, దేవాదాయ శాఖ, జిల్లా కలెక్టర్‌లు చర్చించి ఒక మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తారని చెప్పారు. నివేదిక ప్రకారం తిరుమల తరహాలో శ్రీశైలం అలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సున్నిపెంట ప్రాంతాన్ని కూడా నివాస యోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

” అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లు. అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. అలా చేస్తే ఆదాయం పెరుగుతుంది. తద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ విధనాల కారణంగా రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన భరోసా, మాపై పెట్టకున్న నమ్మకంతో ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ పైనుంచి బయపడ్డాం. ఈ రోజు కేంద్రంలో మనం అధికారంలో లేకపోయిఉంటే.. వాళ్లు కూడా సహకరించకపోతే శ్వాస తీసుకోలేని పరిస్థితి మనది. ఈ పరిస్థితికి ఎవరు కారణం. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయి. నదుల అనుసంధానం చేసి గోదావరి, పెన్నా, వంశధార వరకు కలపాలి. ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తున్నాం. పోలవరానికి గోదావరి నీటిని తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ఆలోచనలు చేస్తున్నాం. ఇది జరిగితే గేమ్‌ఛేంజర్‌ అవుతుంది. తొందర్లోనే శుభవార్త చెబుతాను. రాయలసీమ రతనాల సీమ అవుతుంది” అని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement