Sunday, October 6, 2024

AP మ‌రుగుదొడ్లు క‌డిగిస్తున్నారు – ఆ గురుకులంలో ఉండలేము – విద్యార్ధులు గగ్గోలు

అయ్యావార్ల తీరుపై స్టూడెంట్స్ ఆగ్ర‌హం
ఫెన్సింగ్ దూకి కొండపైకి జంప్‌
40 మంది విద్యార్థుల తెంప‌రిత‌నం
టీచర్లు కొడుతున్నారు.. బూతులు తిడుతున్నారు
అన్నం కూడా అస్సలు బాగుంట‌లేదు
పల్నాడులోని గురుకుల విద్యార్థుల ఆవేద‌న‌
రంగంలోకి పోలీసులు.. స్టూడెంట్స్‌కి ఊర‌డింపు

ఆంధ్రప్రభ స్మార్ట్, పల్నాడు ప్రతినిధి: టీచర్లు, ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి 40 మంది పదో తరగతి విద్యార్థులు సోమవారం ఉదయం పారిపోయారు. మిగతా విద్యార్థులు సోలార్ ఫెన్సింగ్‌ గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది పట్టుకున్నారు. ఈ సమాచారంతో పోలీసులు, సంక్షేమ శాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. పదో తరగతి చదువుతున్న 67 మంది విద్యార్థులందరూ సోమవారం ఉదయం సోలార్ ఫెన్సింగ్తో ఉన్న గోడను దూకి పారిపోయే ప్రయత్నం చేశారు.

- Advertisement -

రంగంలోకి పోలీసులు..

దీనిని గమనించిన సిబ్బంది వెంటనే 27 మందిని పట్టుకున్నారు. మరో 40 మంది పాఠశాల ప్రహరీ గోడ దూకి సమీపంలోని కొండవీడు కొండలపైకి వెళ్లారు. విద్యార్థులు ఎటు వెళ్లారనే విషయంపై ఉపాధ్యాయులు చుట్టుపక్కల ఆరా తీయగా విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్సై బాలకృష్ణ పోలీసులతో కలిసి కొండల వద్దకు వెళ్లి విద్యార్థులను తీసుకుని వచ్చారు. ఘటన స్థలికి నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను విచారించారు. అసలు కొండపైకి ఎందుకెళ్లారంటూ పోలీసులు ప్రశ్నించారు. దీంతో విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ హనుమంతరావు తరుచూ వేధిస్తున్నాడని చిన్న చిన్న విషయాలకే తమను కొడుతున్నాడని విద్యార్ధులు చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బా నాయుడుకి చెప్పారు. ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేకే ఇక్కడికి పారిపోయి వచ్చామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధుల సమస్య తెలుసుకున్న పోలీసులు వెంటనే వారందరిని బుజ్జగించి కొండ దించారు.

స్టూడెంట్స్‌ బాధలివి…

వసతి గృహంలో సౌకర్యాలు సరిగా లేవని, అన్నం బాగోలేదు. ఆటలు ఆడించటం లేదు. మరుగుదొడ్లు కడిగిస్తున్నారు. అని విద్యార్థులు ఆరోపించారు. ప్రతి రోజూ స్లిప్ టెస్టులు పెడుతున్నారు. అన్ని సబ్జెక్టులు ఒకేసారి పెడుతుండటంతో రాయలేకపోతున్నామని తెలిపారు. దీంతో డీఎస్పీ నాగేశ్వరరావు వార్డెన్, ఉపాధ్యాయులను పిలిచి మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తల్లిదండ్రులు కంగారు పడతారని, కాబట్టి ఈ విధంగా ఎప్పుడూ చేయొద్దని విద్యార్థులకు సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని, అప్పుడప్పుడూ తాను వస్తానని పోలీసులు తెలిపారు. అమ్మానాన్న వచ్చినప్పుడు ఏదైనా సమస్య చెబితే, ఎందుకు మీరు చెప్పారు అని ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు బయటకు వెళ్తే గోడ దూకి వెళ్తున్నారని, అప్పుడు అలా వెళ్లొద్దని ఉపాధ్యాయులు తిడుతున్నారని అన్నారు. అదే విధంగా కొంతమంది టీచర్లు తినకూడని పదార్థాలు తింటున్నారని విద్యార్థులు చెప్పారు. చివరికి క్రాప్ చేయించుకుంటే కటింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement