Thursday, April 25, 2024

శ్రావణ మాసంలో టిడ్కో ఇళ్లు.. పేదలందరికీ ఇంటి వసతి

టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టి పూర్తి అయిన ఇళ్లను వచ్చే నెలలో లబ్ధిదారులకు అందచేయనున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకు తగినట్లుగా అన్ని పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇంటి వసతిని కల్పించాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతమైనదిగా గుర్తించి పనులను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. టిడ్కో గృహాలకు సంబంధించిన పనుల పురోగతి, బ్యాంకు రుణాల మంజూరు తదితర అంశాలపై బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టిడ్కో ఎండి శ్రీధర్, మెప్మా ఎండి విజయలక్ష్మి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్తి అయిన టిడ్కో ఇళ్లను వచ్చే పక్షం రోజుల్లో (శ్రావణ మాసంలో) లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయనున్నామని,  ఈ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులు కూడా జోరుగా జరుగుతున్నాయని చెప్పారు.  ప్రభుత్వ నిర్ణయం మేరకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లు/ఫ్లాట్లను పూర్తి ఉచితంగా అందచేయనున్నామన్నారు. మిగిలిన అన్ని కాలనీల్లో నిర్మాణపు పనులతో పాటు, మౌలిక వసతుల కల్పన పనులను కూడా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

ఈ ఇళ్లకు సంబంధించి అగ్రిమెంటు కుదుర్చుకున్న లబ్దిదారులకు బ్యాంకు రుణాల మంజూరులో టిడ్కో, మెప్మా  అధికారులు, బ్యాంకుల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలన్నారు. ఎలాంటి సమాచార లోపం లేకుండా, నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందించుకుని చురుకుగా వ్యవహరించాలన్నారు. లబ్ధిదారులకు రుణాల మంజూరు  అంశంలో ఏమాత్రం నిర్లిప్తత కూడదని, నిర్ధిష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి ప్రకారం అధికారులు పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తే ఫలితాలు సాధించవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇకపై ప్రతి వారం టిడ్కో, మెప్మా అధికారులతో తాను టెలీకాన్ఫరెన్సు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, వాటిని వెంటనే రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి అవి పరిష్కారం అయ్యేలా చూసుకోవాలని మంత్రి బొత్స నిర్దేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement