Sunday, November 10, 2024

AP – న్యాయవాదుల విహారయాత్ర విషాదం – చంద్రబాబు దిగ్భ్రాంతి

విజయవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు ప్రయాణిస్తున్న బస్సుకు ఘోర ప్రమాదం సంభవించింది. న్యాయవాదులు అంతా కలిసి రెండు బస్సుల్లో విహారయాత్రకు వెళ్లారు.

ఈ క్రమంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ వద్ద మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు రెండు బస్సుల్లో ఒక బస్సు ప్రమాదానికి గురైంది.ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీ కొట్టడంతో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాజేంద్రప్రసాద్ సహా మరో 11 మందికి గాయాలవ్వగా.. వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

రాజస్థాన్ లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన సీఎం…వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు.

నారా లోకేష్ సంతాపం

మహిళా భద్రత, సాధికారత కోసం ఉద్యమించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ గారి సతీమణి గొల్లపల్లి జ్యోత్స్న గారు రాజస్థాన్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది.‌ వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. విహారయాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరం. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేంద్ర ప్రసాద్ గారు, న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను….నారా లోకేష్విద్య, ఐటి శాఖల మంత్రి

Advertisement

తాజా వార్తలు

Advertisement