Friday, October 4, 2024

AP – తిరుమ‌ల‌ ల‌డ్డూతో చంద్ర‌బాబు రాజకీయం – వైసిపి

మంగ‌ళ‌గిరి – తిరుమల వేంకటేశ్వర స్వామివారిని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, లడ్డూ ప్రసాదం వ్యవహారంలో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఆ వేంకటేశ్వర స్వామి చంద్రబాబును క్షమించబోరని వైసిపి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి ఆయన మరో సీనియర్ నేత పేర్ని నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీతో కలిసి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని ఎప్పుడూ వాడలేదని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, శ్రీవారి ప్రతిష్టను మంటగలిపేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జంతు కొవ్వు కలిసినట్టుగా చెప్తున్నారని మండిపడ్డారు. జంతు కొవ్వు కలిసినట్టుగా ఎవరూ రిపోర్ట్ ఇవ్వలేదని అని పేర్కొన్నారు.

చంద్రబాబు అసలు వేంకటేశ్వర స్వామివారి భక్తుడు కాదని ఆరోపించారు. ఎన్నిసార్లు కాలినడకన స్వామివారిని దర్శించుకున్నారని, వేంకటేశ్వర స్వామికి చంద్రబాబు ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించారని ఆయన ప్రశ్నించారు. 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలో మొత్తం 15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని ట్యాంకర్లను తిప్పి పంపించారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారని నాని ప్రస్తావించారు.

- Advertisement -

28న ఆలయాల్లో పూజలు
లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చెప్తుంటే.. అలాంటిది ఏమీ లేదని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్తున్నారని పేర్ని నాని అన్నారు. లోకేశ్ అయితే పందికొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లకు వత్తాసు పలుకుతూ పవన్ కల్యాణ్ కూడా అదే దారిలో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నేతల పాపాలను క్షమించి వదిలేయమని కోరుతూ సెప్టెంబర్‌ 28న వైసీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేస్తామని పేర్ని నాని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement