Friday, April 26, 2024

ఆనందయ్య కంటిమందుపై తీర్పు రిజర్వ్

కరోనాకు ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో విచారణ ముగిసింది. వాదనలు విన్న అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. వాదనల సందర్భంగా… ఆనందయ్య కంటిమందును తాము వ్యతిరేకించడం లేదని, అయితే కంటిమందు విషయంలో నిపుణుల కమిటీ రావాల్సి ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం పేర్కొంది.

దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి కంటి మందుకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించింది. ఆ విధంగా అయితే అందరూ అత్యవసర పరిస్థితి అంటూ వస్తారని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ మాట్లాడుతూ, రోజుకు 15  నుంచి 20 మందే వస్తున్నారని వెల్లడించారు. అనంతరం ప్రభుత్వం స్పందిస్తూ… ఆనందయ్య మందును తాము వ్యతిరేకించడం లేదని, అలా అని నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా అనుమతి ఇవ్వమని స్పష్టం చేసింది. ఆనందయ్య మందులో ఐ డ్రాప్స్ విషయంలో తప్ప మిగతా అన్నిటికీ ప్రభుత్వం అనుమతి ఇచిందని గుర్తు చేసింది. నివేదిక వచ్చేందుకు 3 వారాలు పడుతుందని, ఇప్పటికిప్పుడు అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement