Wednesday, April 24, 2024

మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే.  తనపై అక్రమంగా కేసులు బనాయించారంటూ దేవినేని ఉమా హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 

కాగా, ఉమాపై ఎస్పీ,ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద జి.కొండూరు పోలీస్ స్టేషన్ లో కేసులు చేసిన సంగతి తెలిసిందే. జులై 28వ తేదీన కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దేవినేని ఉమాతో పాటు పలువురు టీడీపీ నేతలు మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు దేవినేని ఉమా వర్గాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్తలు దేవినేని ఉమా కారుపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో వాహనం ధ్వంసంతోపాటు.. పలువురు గాయపడేందుకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. అయితే, ఈ వ్యవహారంలో దేవినేని ఉమా కావాలనే అక్కడికి వెళ్లి ఘర్షణ రేపారని పోలీసులు తెలిపారు. కారు అద్దం పగులగొట్టి మరీ పోలీసులు ఉమాను అరెస్టు చేసి..పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అనంతరం పోలీసులు దేవినేని ఉమాను అరెస్ట్ ఆయనపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మరికొన్ని కేసులు నమోదు చేశారు. ఆయన్ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రెండు వారాల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఐతే జైలులో ఆయనకు ప్రాణహాని ఉందంటూ దేవినేని ఉమా కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై పోలీసులు పెట్టిన కేసులు అక్రమమని.. అలాగే ఆయా సెక్షన్లకు సంబంధించిన నేరాలకు పాల్పడలేదంటూ ఉమా తరపు లాయర్లు హైకోర్టులో వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement