Thursday, April 25, 2024

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడితే 100 రోజుల్లో చర్యలు

అవినీతి కేసుల్లో దొరికిన ఉద్యోగులపై చర్యలకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమించింది. వందరోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వందరోజులు దాటితే ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవినీతి కేసుల్లో దొరికిన ఉద్యోగులపై వందరోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్రమశిక్షణ చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది… పక్కా ఆధారాలతో దొరికిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కేసుల్లో ప్రభుత్వోద్యోగులపై 100 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నిర్దేశిత కాలపరిమితిలోగా వాటిని అమలు చేయటంలో విఫలమైతే ఆ జాప్యానికి సంబంధిత శాఖాధికారులు, ఏసీబీ అధికారుల్ని బాధ్యుల్ని చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ తరహా కేసుల్లో బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నిర్దేశిత కాలపరిమితి లేకపోవటంతో అంతులేని జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

1995 నుంచి 2020 వరకూ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డవారికి సంబంధించి మొత్తం 476 కేసులు ఏసీబీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న మొత్తం అవినీతి కేసుల సంఖ్య 1,686. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కేసుల్లోనూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సుదీర్ఘ సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సస్పెన్షన్‌లో ఉంటూ ఎలాంటి పని లేకుండానే వేతనాలు పొందుతున్నారు. ఇది ఖజానాకు భారంగా మారుతోంది. ఈ అవాంఛనీయ జాప్యం వల్ల సత్వరం శిక్ష పడుతుందన్న భయమూ లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కాలపరిమితి విధించాం’ అని ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వుల్లో వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement