Friday, March 29, 2024

తీపి కబురు: సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల స్టయిఫండ్ పెంపు

ఏపీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకిచ్చే స్టయిఫండ్ ను రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు తమకిచ్చే స్టయిఫండ్ ను పెంచాలని కోరారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్డర్లు గత ఏడాది సెప్టెంబర్ లో విధుల్లోకి చేరారన్నారు. 800 పీజీ విద్యార్థుల వినతులపై చర్చించి వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొవిడ్ సమీక్షా సమావేశాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నిర్వహించనున్నారని సింఘాల్ తెలిపారు.

మరోవైపు ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు, తమకు ఇన్ సెంటివ్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తమకు కూడా ఇన్ సెంటివ్స్ ఇవ్వాలని నోటీసులో ప్రస్తావించారు. ఇవ్వకపోతే విధులు బహిష్కరిస్తామని జూడాలు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్స్, ఫైనల్ ఇయర్ పోస్టు గ్రాడ్యుయేట్స్ మంగళవారం విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. సుమారు వంద మందికిపైగా జూనియర్ డాక్టర్లు(జుడా) ఆసుపత్రిలో కొవిడ్ డ్యూటీలకు వెళ్లకుండా నల్లబ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి ఎమెర్జెన్సీ విభాగం వద్ద నిరసన చేశారు. సీనియర్ రెసిడెంట్స్‌కు స్టయిఫండ్ పెంచాలని, ఏడాది కాలంగా కొవిడ్ డ్యూటీలు చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు విధులకు హాజరుకాబోమని, తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకిచ్చే స్టయిఫండ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement